క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారన్న ఆరోపణలపై తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిని వైసీపీ నుంచి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. సస్పెన్షన్ తర్వాత తాడికొండలో ఉండవల్లి శ్రీదేవి కార్యాలయంపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. ఆ తర్వాత ఉండవల్లి శ్రీదేవి అజ్ఞాతంలోకి వెళ్లారని ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే తాజాగా మీడియా ముందుకు ఉండవల్లి శ్రీదేవి, ఆమె భర్త శ్రీధర్ వచ్చారు. ఈ సందర్భంగా సీఎం జగన్ పై ఉండవల్లి శ్రీదేవి సంచలన వ్యాఖ్యలు చేశారు.
తాను అజ్ఞాతంలోకి వెళ్లానని విమర్శిస్తున్నారని, శ్రీదేవి ఎక్కడా అంటూ పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని శ్రీదేవి ఆవేదన వ్యక్తం చేశారు. దోచుకో పంచుకో తినుకో అని జగన్ చెబుతారని, ఉద్దండరాయునిపాలెంలో ప్రజా సంపదను ఎవరు దోచుకుంటున్నారో జగన్ చెప్పాలని శ్రీదేవి డిమాండ్ చేశారు. జగన్ కు చెవులు మాత్రమే ఉంటాయని, ఎవరు చెప్పినా వింటారని అన్నారు. తాను ఎవరికి ఓటేశానో తెలియకుండా ఇష్టమొచ్చినట్లు మాట్లాడారని, ఎన్నికలకు ముందు తన కుమార్తెతో కలిసి జగన్ ను కలిశానని అన్నారు. రహస్య బ్యాలెట్ జరిగితే ఒక్కొక్కరిని ఎలా విమర్శిస్తున్నారని నిలదీశారు. నిబంధనల ఉల్లంఘన పేరుతో సస్పెండ్ చేశారని ఆరోపించారు.
రాజధానిలో శ్రీదేవిని తప్పించాలని పక్కా ప్లాన్ వేసి గూండాలను తన ఆఫీసుపైకి పంపారని, తానేమైనా మాఫియా డాన్నా అజ్ఞాతంలోకి వెళ్లడానికి? అని ప్రశ్నించారు. గతంలో డా.సుధాకర్, డా.అచ్చెన్న ఎలా చనిపోయారరో ప్రజలకు తెలుసని, అదే మాదిరిగా డా.శ్రీదేవి చనిపోకూడదనే ఉద్దేశంతోనే వెళ్లిపోయానని వివరణనిచ్చారు. తన తప్పేంటో చెప్పకుండా వేధింపులకు గురిచేశారని ఆవేదన చెందారు. జగనన్న ఇళ్ల పథకం పెద్ద కుంభకోణం అని, రూ.వేల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు.
ఎస్సీలను అణగదొక్కేందుకు దాడులు చేస్తున్నారని, చంపుతున్నారని ఆరోపించారు. సామాన్యులు రాష్ట్రంలో తిరిగే పరిస్థితి లేదని అన్నారు. రాజధాని ప్రాంతంలో తాను తప్ప ఎవరూ గెలవలేరని అన్నారు. తాను రూ.15 కోట్లు తీసుకున్నానని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, తనపై పిచ్చి కుక్క అని ముద్ర వేస్తున్నారని ఆరోపించారు. రాజధాని అమరావతిలోనే ఉంటుందని తనకు చెప్పారని, కానీ, అలా జరగలేదని ఆవేదన చెందారు.
అమరావతి రైతులకు ఏం చేయలేక పోతున్నానని మదనపడేదాన్నని, అమరావతిలో జగన్ కనీసం ఒక ఇటుకైనా పేర్చారా అని ప్రశ్నించారు. నాలుగేళ్లు బానిస సంకెళ్లలో ఉన్నానని, ఇకపై తన ప్రాణం పోయినా అమరావతి కోసం నిలబడతానని మాటిచ్చారు. సజ్జల రామకృష్ణారెడ్డి నుంచి తనకు ప్రాణహాని ఉందని, తనకు ఏదైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు. జాతీయ ఎస్సీ కమిషన్ కు ఫిర్యాదు చేసే ఏపీలో అడగుపెడతానని, తనకు పోలీసు రక్షణ కల్పించాలని కోరారు.
దళిత మహిళా ఎమ్మెల్యే ఏమీ చేయలేదని అనుకోవద్దని, జగన్ కొట్టిన దెబ్బకు తన మైండ్ బ్లాంక్ అయిందని అన్నారు. కానీ, త్వరలో మంచి రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని సవాల్ చేశారు. తాను డబ్బు తీసుకున్నానని నిరూపిస్తారా? ప్రమాణం చేయడానికి కాణిపాకం వస్తారా? అమరావతి వస్తారా? అని ఛాలెంజ్ చేశారు. వైసీపీ దందాలు, మైనింగ్ లకు బినామీగా ఉండలేనని చెప్పానని, అందుకే తనను పార్టీ నుంచి తప్పించారని ఆరోపించారు.