సీఎంగా జగన్ పగ్గాలు చేపట్టింది మొదలు అమరావతి రాజధానిపై అక్కసు పెంచుకున్న సంగతి తెలిసిందే. జగన్ సీఎం అయితే అమరావతి నుంచి రాజధానిని తరలిస్తారని టీడీపీ నేతలు గగ్గోలు పెట్టినా…జగన్ ను గెలిపించిన ఓటర్ల చెవికెక్కలేదు. తీరా జగన్ గెలిచాక…మూడు రాజధానులంటూ కొత్త పల్లవి ఎత్తుకున్న తర్వాత గాని జనానికి తత్వం బోధపడలేదు. అయితే, మూడు రాజధానులపై, అమరావతి భూములపై, సీఆర్డీఏ చట్టంపై టీడీపీ నేతలు, అమరావతి రైతులు న్యాయపోరాటం చేయడంతో జగన్ వెనక్కు తగ్గారు.
మూడు రాజధానులతోపాటు సీఆర్డీఏ బిల్లు రద్దుకు రూపొందింంచిన బిల్లులను వెనక్కు తీసుకుంటున్నామని జగన్ ప్రకటించడంతో అమరావతి రైతులంతా ఊపిరి పీల్చుకున్నారు. కానీ, జగన్ మరోసారి బిల్లు పెడతామని, మూడు రాజధానులపై మరింత నిశితంగా పరిశీలించి సమగ్ర బిల్లుతో వస్తామని చెప్పడంతో రైతులు నిరాశచెందారు. వారి నిరాశా నిస్పృహలను మరింత పెంచేలా జగన్ తాజాగా మరో బాంబు వేయడానికి రెడీ అవుతున్నారని తెలుస్తోంది.
ఏపీ రాజధానిగా విశాఖపట్నం ఫిక్స్ అయిందని, శ్రీరామ నవమినాడు అధికారిక ప్రకటన వెలువడనుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతానికి ఏపీ ఖజానాలో రాజధాని కట్టేంత సొమ్ము లేదని, కాబట్టి విశాఖలో అద్దె బిల్డింగులతో పనికానిచ్చే వ్యూహంతో జగన్ ఉన్నారని పుకార్లు వినిపిస్తున్నాయి. ఈ ప్రకారం విశాఖ రాజధానిగా కొత్త బిల్లు రెడీ అయిందని, శ్రీరామనవమి నాడు అధికారిక ప్రకటన వెలువడవచ్చని టాక్ వస్తోంది.
అయోధ్యకు రాముడు వచ్చిన రోజున నూతన రాజధాని ప్రకటన చేయడం సమంజసమన్న కాన్సెప్ట్ లో వైసీపీ నేతలున్నారట. విశాఖే రాజధాని అంటూ మంత్రి బాలినేని కూడా కొద్ది రోజుల క్రితం పరోక్ష ప్రకటన చేశారు. సాంకేతిక అంశాల్ని పక్కనబెట్టి..మిగిలిన అంశాలలో విశాఖను రాజధానిగా ముందుకు తీసుకెళ్లే యోచనలో జగన్ ఉన్నారట. అయితే, మరోసారి బిల్లు పెడితే….దీటుగా న్యాయపోరాటం చేసేందుకు టీడీపీ కూడా సన్నద్ధమవుతోందట.