3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో విజయవాడ నగరం చిగురుటాకులా వణికిపోతున్న సంగతి తెలిసిందే. 30 ఏళ్లలో ఎన్నడూ లేనంత వర్షపాతం నమోదైన నేపథ్యంలో విజయవాడలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. ముఖ్యంగా బుడమేరు నుంచి భారీగా నీరు రావడంతో సింగ్ నగర్ జగదిగ్బంధమైంది. బెజవాడలోని పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఈ క్రమంలోనే సింగ్ నగర్ లో వరద బాధితులను సీఎం చంద్రబాబు స్వయంగా పరామర్శించారు.
వరద నీటిలో బోట్ లో ప్రయాణించిన చంద్రబాబు బాధితుల దగ్గరికి వెళ్లి వారితో స్వయంగా మాట్లాడారు. విజయవాడలో సుమారు మూడు లక్షల మంది వరద బాధితులు ఉన్నారని, వారందరికీ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసానిచ్చారు. వారందరికీ తాగునీరు, పాలు, ఆహారం అందించాలని అధికారులను ఆదేశించారు. 1998 తర్వాత ఈ స్థాయిలో భారీ వర్షాలు కురిశాయని, వర్షం ముప్పు మరో రెండు రోజుల పాటు ఉందని, వరద నీరు రేపు, ఎల్లుండి ఇంకా పెరిగే అవకాశం ఉందని చంద్రబాబు చెప్పారు.
యుద్ధ ప్రాతిపదికన నష్ట నివారణ చర్యలు చేపట్టామని చంద్రబాబు అన్నారు. ఇక, విజయవాడలో భారీ వరదలపై కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా తో చంద్రబాబు మాట్లాడారు. ఈ వరదలను జాతీయ ఉత్పత్తిగా ప్రకటించాలని రేపు కేంద్రాన్ని కోరతామని చంద్రబాబు అన్నారు. రాష్ట్రాన్ని ఆదుకోవాలని కేంద్రాన్ని విజ్ఞప్తి చేస్తామని చంద్రబాబు చెప్పారు. ఇక శ్రీశైలం నాగార్జునసాగర్ పులిచింతల ప్రాజెక్టు నుంచి భారీగా ప్రకాశం బ్యారేజ్ కి నీరు వస్తుందని దాంతోపాటు మున్నేరు బుడమేరు నుంచి కూడా వరద నీరు భారీగా రావడంతో విజయవాడ నీటి మునిగిందని చెప్పుకొచ్చారు.
బుడమేరు నుంచి కొల్లేరుకు వెళ్లాల్సిన నీరు విజయవాడకు వచ్చిందని చంద్రబాబు అన్నారు. గత ఐదేళ్లలో బుడమేరు నిర్మాణాన్ని వైసీపీ ప్రభుత్వం గాలికి వదిలేయడంతోనే ఈరోజు ఈ పరిస్థితి వచ్చిందని చంద్రబాబు ఆరోపించారు. రేపు రాష్ట్రానికి పది ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, 40 పవర్ బోట్లు, 6 హెలికాఫ్టర్లు రాబోతున్నాయని చెప్పారు. వరద సహాయక చర్యల కోసం ప్రభుత్వ యంత్రాంగం మొత్తాన్ని మోహరించామని చంద్రబాబు తెలిపారు. తాను విజయవాడ కలెక్టరేట్లో రాత్రి మొత్తం బస చేసి పరిస్థితిని స్వయంగా పర్యవేక్షిస్తానని చంద్రబాబు అన్నారు.