సీఎం జగన్ ను మళ్లీ జైలుకు పంపేదాకా ఏపీలో అడుగు పెట్టబోనని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు మంగమ్మ శపథం చేసిన సంగతి తెలిసిన సంగతి తెలిసిందే. తన శపథాన్ని నెరవేర్చుకునే క్రమంలో రఘురామ చాలావరకు సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు. ఆగస్టు 25న జగన్ బెయిల్ రద్దు విచారణ తుది తీర్పు రానుందని సర్వత్రా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు, జగన్ అక్రమాస్తుల కేసులో ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్ కూడా రద్దు చేయాలని రఘురామ …నాంపల్లి సీబీఐ కోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే.
ఈ పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు…కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐని ఆదేశించింది. ఈ పిటిషన్ కు సంబంధించి విజయసాయికి కూడా కోర్టు నోటీసుులు జారీ చేసింది. తాజాగా ఈ పిటిషన్ పై హైదరాబాద్ సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. ఈ పిటిషన్ పై కౌంటర్ దాఖలుకు మరింత గడువు కావాలని సీబీఐ కోరింది. దీంతో, ఈ నెల 13కు ఈ పిటిషన్ తదుపరి విచారణ వాయిదా పడింది..
అయితే, ఈ రోజు విచారణ సందర్భంగా సీబీఐ కోర్టులో పలు ఆసక్తికర పరిణామాలు జరిగినట్లు పలు మీడియా సంస్థల్లో కథనాలు వచ్చాయి. విజయసాయి తరఫు లాయర్లు నేడు విచారణకు హాజరయ్యారా? లేదా? అన్న విషయంపై సస్పెన్స్ కొనసాగుతోందని ప్రచారం జరిగింది. నోటీసులు తీసుకోడానికి సాయిరెడ్డి నిరాకరించారని కోర్టు దృష్టికి రఘురామ తరఫు లాయర్లు తీసుకొచ్చారని మీడియాలో కథనాలు వచ్చాయి. అంతేకాదు, దీనిని కోర్టు ధిక్కారంగా పరిగణించాలని రఘురామ లాయర్లు కోరారని, దీంతో కోర్టు విజయసాయిపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు కొన్ని మీడియా చానెళ్లలో రిపోర్టులు వచ్చాయి.
ఈ నెల 13న సీబీఐతో పాటు విజయసాయిరెడ్డి కూడా కౌంటర్ దాఖలు చేయాల్సిందేనని జడ్జి ఆదేశించారని, రఘురామ తరఫు లాయర్ల ద్వారా ఈ విషయం వెల్లడైందంటూ కొన్ని మీడియా సంస్థల రిపోర్టుల సారాంశం. అయితే, కొన్ని మీడియా చానెళ్లలో వచ్చిన విషయాలను అన్ని మీడియా చానెళ్లు అధికారికంగా ధృవీకరించలేదు. అదే సమయంలో విజయసాయి తరఫు లాయర్లు కూడా వీటి గురించి మాట్లాడలేదు. దీంతో, నిజంగానే సీబీఐ కోర్టు నోటీసులకు సాయిరెడ్డి స్పందించలేదా? విజయసాయిపై జడ్జి ఆగ్రహం వ్యక్తం చేశారా? అన్న విషయాలపై స్పష్టత లేదు.