షూటింగ్ లో గాయపడ్డ ప్రకాష్ రాజ్…సర్జరీ
చెన్నైలో గాయపడిన ప్రకాష్ రాజ్…హైదరాబాద్ లో చికిత్స
దక్షిణాది చిత్ర పరిశ్రమలో విలక్షణ నటుడిగా పేరుగాంచిన ప్రకాశ్‌రాజ్ ఓ ప్రమాదంలో గాయపడ్డారు. ధనుష్ హీరోగా నటిస్తున్న ఓ తమిళ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న ప్రకాష్ రాజ్…ఆ చిత్ర షూటింగ్ సందర్భంగా ప్రమాదానికి గురయ్యారు. చెన్నైలో ఆ చిత్రానికి సంబంధించిన కీలక సన్నివేశాల చిత్రీకరణ సందర్భంగా ప్రకాశ్‌రాజ్ కు గాయాలయ్యాయని తెలుస్తోంది. ప్రకాష్ రాజ్ చేతితో పాటు పలు చోట్ల స్వల్ప గాయాల య్యాయని తెలుస్తోంది.
అయతే, ప్రకాష్ రాజ్ కు మంగళవారం సాయంత్రం హైదరాబాద్ సన్‌షైన్ ఆసుపత్రిలో సర్జరీ నిర్వహించబోతున్నారు. చెన్నై నుంచి హైదరాబాద్‌కి పయనమైన ప్రకాష్ రాజ్ తనకు జరిగిన ప్రమాదంపై స్పందించారు. తనకు చిన్న ఫ్రాక్చర్ జరిగిందని, తాను బాగానే ఉన్నానని ప్రకాష్ రాజ్ తెలిపారు. తన గాయాల గురించి అభిమానులెవరూ ఆందోళన పడవద్దని ప్రకాష్ రాజ్ అన్నారు. తాను కింద పడటంతో తన కాలికి ఫ్యాక్చర్ అయిందని..తన ఆరోగ్య స్థితి గురించి చింతించాల్సిన పని లేదని ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు.
తన స్నేహితుడు డా.గురవారెడ్డి తనకు సర్జరీ చేయనున్నారని, అందుకే హైదరాబాద్ వచ్చానని ప్రకాష్ రాజ్ చెబుతున్నారు. త్వరలోనే మళ్లీ షూటింగ్ లో పాల్గొంటానని ప్రకాష్ రాజ్ తెలిపారు. ప్రకాష్ రాజ్ త్వరలో కోలుకోవాలని ఆయన అభిమానులు ప్రార్థనలు చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా…గెట్ వెల్ సూన్ అంటూ పోస్టులు పెడుతున్నారు. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ చిత్రాలతో ప్రకాష్ రాజ్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. త్వరలో జరగబోయే ‘మా’ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న బలమైన అభ్యర్థుల్లో ప్రకాష్ రాజ్ ఒకరు.
మరోవైపు, ‘మా ‘ అధ్యక్ష ఎన్నికల వేడి రాజుకుంటున్న తరుణంలో చిరంజీవి కూడా స్పందించిన సంగతి తెలిసిందే. త్వరలో ఎన్నికలు జరపాలంటూ చిరు కూడా అభిప్రాయపడడంతో ఎన్నికల నగారా మోగినట్లే అంటున్నారు. ఈ క్రమంలోనే చెన్నైలో గాయపడిన ప్రకాష్ రాజ్…ఎన్నికల కోసమే హైదరాబాద్ వస్తున్నారని సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. ఆ సర్జరీ ఏదో చెన్నైలో చేయించుకొని అక్కడే విశ్రాంతి తీసుకోవచ్చని, చిన్న సర్జరీ కోసం ఇంతదూరం రావాల్సిన అవసరం లేదు కదా అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. హైదరాబాద్‌కు వస్తే సర్జరీ, ఎన్నికల పనులు..చూసుకోవచ్చని ప్రకాష్ రాజ్ ఇక్కడకు వచ్చారని అంటున్నారు.