కోలీవుడ్ హీరోయిన్, లేడీ సూపర్ స్టార్ నయనతార, తమిళ డైరెక్టర్ విఘ్నేశ్ శివన్ లు తిరుమల వెంకన్న సన్నిధిలో వివాహం చేసుకోవాలని అనుకున్న సంగతి తెలిసిందే. అయితే, నయన్, విఘ్నేశ్ ల వంటి వీఐపీల పెళ్లికి వచ్చే అతిథులు, అభిమానులను కట్టడి చేయడం కష్టమని, భద్రతాపరమైన కారణాలతో టీటీడీ అందుకు అనుమతించలేదు. దీంతో, వారు మహాబలిపురంలో పెళ్లి చేసుకున్నారు. అయితే, నయన్ క్రిస్టియన్ కాబట్టే తిరుమలలో పెళ్లికి అనుమతించలేదని సోషల్ మీడియాలో టాక్ వచ్చింది. కట్ చేస్తే…వివాహం అనంతరం నయన్ దంపతులు శ్రీవారి దర్శనానికి వచ్చారు.
అయితే, కొండపై శ్రీవారి ఆలయం చుట్టూ ఉన్న మాడ వీధుల్లో కలియ దిరిగిన ఈ దంపతులు వివాదంలో చిక్కుకున్నారు. పవిత్రమైన మాడవీధుల్లో విఘ్నేశ్ చెప్పులు విడిచి నడిచినా.. నయనతార మాత్రం చెప్పులతోనే నడవడం పెను దుమారం రేపింది. శ్రీవారి ఆలయం ప్రధాన ద్వారానికి అత్యంత సమీపంలోనే నయన్ చెప్పులు వేసుకొని తన భర్తతో ఫొటో షూట్లో పాల్గొనడం కలకలం రేపింది. ఇది అపచారమని, ఇలా చేయడం తిరుమల పవిత్రతకు భంగం కలిగించడమేనని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి.
దీంతో, ఆ ఫొటోషూట్పై టీటీడీ ఆగ్రహం వ్యక్తం చేసింది. నయనతార కాళ్లకు చెప్పులతోనే మాడ వీధుల్లో సంచరించడం దురదృష్టకరమని వ్యాఖ్యానించింది. అంతేకాదు, నయనతార దంపతులపై పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నామని టీటీడీ ప్రకటించింది. వారిపై ఏఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలన్న విషయంపై చర్చిస్తున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు.
మరోవైపు, తాజాగా ఆ వ్యవహారంపై విఘ్నేశ్ స్పందించారు. కాళ్లకు చెప్పులు ధరించి తిరుమల మాడ వీధుల్లో నడవడం పట్ల విఘ్నేశ్ క్షమాపణలు చెప్పారు. నయనతార కాళ్లకు చెప్పులున్నాయన్న విషయాన్ని గమనించలేదని వివరణనిచ్చే ప్రయత్నం చేశారు. శ్రీవారిపై ఎంతో నమ్మకం, భక్తి ఉన్నాయని, తెలియక చేసిన తప్పును దయచేసి మన్నించాలని వేడుకుంటూ టీటీడీకి ఓ లేఖ రాశారు.
అయితే, విఘ్నేశ్ వివరణపై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. సాధారణంగా దంపతులిద్దరూ వెళ్లినపుడు భర్త చెప్పులు విడిచే సమయంలో భార్యకూ చెబుతారని, అదే తరహాలో విఘ్నేశ్ చెప్పులు విడుస్తున్న సమయంలో నయనతారకు చెప్పి ఉంటారని అంటున్నారు. అయితే, నయన్ ఆ మాట విని ఉండకపోవచ్చని అంటున్నారు. అదీగాక, ఇంత వివాదం రేగితే…స్వయంగా నయనతార వివరణనివ్వకుండా…తప్పు చేయని విఘ్నేశ్ వివరణనివ్వడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
చెప్పులు వేసుకోవడం తప్పని, ఆ తప్పును ఒప్పుకొని క్షమాపణ కోరకుండా భర్తతో క్షమాపణ చెప్పిించి నయనతార మరో తప్పు చేసిందని అంటున్నారు. ఏది ఏమైనా..ఎంత స్టార్ హీరోయిన్ అయినా నయన్ ధోరణిలో మార్పు రావాలని ట్రోల్ చేస్తున్నారు. ఎంత పొగరు? తప్పు చేసినా క్షమాపణలు చెప్పవా నయన్ ? అంటూ నిలదీస్తున్నారు.