ఉత్తర కొరియా అధ్యక్షుడు కింగ్ జాంగ్ ఉన్ గురించి ప్రపంచ దేశాలకు పరిచయం అక్కర్లేదు. హిట్లర్ తర్వాత ఆ రేంజ్ లో నియంత ప్రభుత్వం కొనసాగిస్తున్న సమకాలీన నియంతగా కిమ్ కు చెడ్డ పేరుంది. అంతా నా ఇష్టం….అడిగేదెవడ్రా నా ఇష్టం అనే తరహాలో కిమ్ చెప్పిందే అక్కడి ప్రజలకు వేదం. కిమ్ చెప్పాడంటే తప్పకుండా పాటించాల్సిందే. కనీసం తమకు నచ్చిన హెయిర్ స్టైల్ చేయించుకునే అవకాశం కూడా అక్కడి ప్రజలకు లేదంటే కిమ్ పాలన ఎంత దారుణంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
ఈ నేపథ్యలోనే ఈ ఏడాది అక్టోబరులో ఇద్దరు యువకులకు కిమ్ విధించిన వైనం హాట్ టాపిక్ గా మారింది. దక్షిణ కొరియా సినిమాలు, కే డ్రామాలు, వెబ్ సిరీస్ లు చూసి వాటిని షేర్ చేశారన్న ఒకే ఒక్క కారణంతో ఉత్తర కొరియాలోని ఇద్దరు యువకులకు కిమ్ మరణ శిక్ష విధించి అమలు చేసిన వ్యవహారం దుమారం రేపుతోంది. తాజా చర్యతో ప్రపంచ వ్యాప్తంగా కిమ్ పేరు మరోమారు మార్మోగిపోతోంది. ఉత్తర కొరియాలో 15,16 సంవత్సరాలున్న ఇద్దరు హైస్కూల్ విద్యార్థులు దక్షిణ కొరియాకు చెందిన కే డ్రామాలు, వెబ్ సిరీస్ లు, సినిమాలు చూశారు.
దాంతోపాటు, వాటిని విస్తృత స్థాయిలో షేర్ చేసి ప్రచారం కల్పించడం, కొందరికి విక్రయించడం వంటివి కూడా చేశారు. ఈ కారణాలతో వారిపై అభియోగాలు మోపిన అధికారులు చట్ట ప్రకారం చర్యలు తీసుకున్నారు. ఉత్తర కొరియాలో ఆ ప్రోగ్రాంలు చూడడంపై నిషేధం ఉందని, దాంతో పాటు వారు వాటిని షేర్ కూడా చేసినందుకే శిక్ష విధించామని అధికారులు చెబుతున్నారు. అక్టోబరులో జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.