బాలీవుడ్ సినిమాల పనైపోయింది…దక్షిణాది సినిమాల దెబ్బకు బాలీవుడ్ అబ్బా అంటోంది…ఇకపై బాలీవుడ్ సినిమాలు ఓటీటీలో రిలీజ్ చేసుకోవాల్సి ఉంటుందేమో…బాలీవుడ్ సినిమాలలో విషయం ఉండడం లేదు…సౌత్ సినిమాలలో కంటెంట్ పాన్ ఇండియా రేంజ్ లో ఉంటోంది…గత కొద్ది రోజులుగా ఇదే చర్చ జోరుగా జరుగుతోన్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ పై అదే ఇండస్ట్రీకి చెందిన వారు కూడా విమర్శలు గుప్పిస్తున్న వైనం అక్కడి ఇండస్ట్రీ పెద్దలకు మింగుడు పడడం లేదు.
పుష్ప, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్-2 లు భారీ విజయాన్ని నమోదు చేసి రికార్డు కలెక్షన్లతో బాక్సాఫీస్ ను బద్దలు కొడుతుండడంతో బాలీవుడ్ నిర్మాతలు బెంబేలెత్తి పోతున్నారు. పుష్ప దెబ్బకు 83 వంటి సినిమా కూడా చిన్నబోయింది. అందుకే, సౌత్ సినిమాల రిలీజ్ డేట్లు చూసుకొని మరీ తమ సినిమాలను బాలీవుడ్ సినిమాల నిర్మాతలు విడుదల చేస్తున్నారు. అయితే, అనూహ్యంగా సర్కారు వారి పాట చిత్రం విడుదల రోజే ధైర్యంచేసి ఓ బాలీవుడ్ సినిమాను రిలీజ్ చేశారు. కానీ, ఆ సినిమా నిరాశ పరచగా…మహేష్ బాబు చిత్రం కలెక్షన్లు కొల్లగొడుతోంది.
దీంతో, ఆ సినిమా ఫలితంపై తాజాగా దర్శకుడు వర్మ స్పందించారు. టాలీవుడ్ నుంచి మహేశ్ బాబు ‘సర్కారు వారి పాట’ చిత్రం ఈ నెల12న రిలీజ్ కాగా, బాలీవుడ్ నుంచి రణవీర్ సింగ్ నటించిన ‘జయేష్ భాయ్ జోర్దార్’ చిత్రం మే 13న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఒక్కరోజు తేడాతో రిలీజైన ఈ రెండు చిత్రాల వీకెండ్ కలెక్షన్లను వర్మ వెల్లడించారు. ‘జయేష్ భాయ్ జోర్దార్’ తొలి వారాంతంలో రూ.11.75 కోట్లు మాత్రమే వసూలు చేసిందని, సర్కారు వారి పాట చిత్రం తొలి వారాంతంలో రూ.135 కోట్ల వరకు వసూళ్లు రాబట్టిందని గణాంకాలతో సహా వెల్లడించారు.
అయితే, వర్మ చేసిన ఆ లెక్కల ట్వీట్ పై ప్రముఖ ఫిలిం క్రిటిక్, ట్రేడ్ అనలిస్ట్ కమాల్ ఆర్ ఖాన్ స్పందించాడు. రణ్ వీర్ సింగ్ సినిమా 11.75 కోట్లు రాబట్టిందన్నది కూడా వట్టిదేనని, నిజానికి ‘జయేష్ భాయ్ జోర్దార్’ వసూలు చేసింది రూ.10 కోట్లు కూడా ఉండదంటూ బాలీవుడ్ గాలి తీసేశాడు. పుండు మీద కారం చల్లినట్లు కమల్ చేసిన ట్వీట్ పై బాలీవుడ్ పెద్దలు కక్కలేక..మింగలేక ఉన్నారు.