టాలీవుడ్ సీనియర్ నటుడు శరత్ బాబు కన్నుమూశారు. కొంతకాలంగా హైదరాబాద్ లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శరత్ బాబు ఈ రోజు తుదిశ్వాస విడిచారు. గత రెండు నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న శరత్ బాబు బెంగళూరులో చికిత్స తీసుకున్న తర్వాత హైదరాబాద్ లోని ఏఐజి ఆసుపత్రిలో చేరారు. నెలరోజులుగా ఇక్కడే చికిత్స తీసుకుంటున్నారు. అయితే, సోమవారం ఉదయం ఆయన ఆరోగ్యం క్షీణించడంతో మధ్యాహ్నం మరణించారని కుటుంబ సభ్యులు వెల్లడించారు.
ఉత్తరప్రదేశ్ నుంచి శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసకు 1950లో శరత్ బాబు కుటుంబం వలస వచ్చింది. 1974లో రామరాజ్యం సినిమాతో తెలుగు తెరకు శరత్ బాబు హీరోగా పరిచయమయ్యారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ సినిమాలలో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా నటించి ప్రేక్షకులను మెప్పించారు. 50 ఏళ్ల సినీ ప్రస్థానంలో శరత్ బాబు 250కి పైగా చిత్రాలలో నటించారు.
శంకరాభరణం, సాగర సంగమం, స్వాతిముత్యం, సంసారం ఒక చదరంగం, అభినందన, ఇది కథ కాదు, సీతాకోకచిలుక వంటి చిత్రాలు శరత్ బాబుకు ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చిపెట్టాయి. నరేష్, పవిత్రా లోకేష్ నటించిన తాజా చిత్రం మళ్ళీ పెళ్లిలో శరత్ బాబు ఒక కీలకపాత్ర పోషించారు. తెలుగులో ఇదే ఆయన చివరి సినిమా. శరత్ బాబు మృతి పట్ల ఏపీ సీఎం జగన్, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు సంతాపం వ్యక్తం చేశారు. శరత్ బాబు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. శరత్ బాబు మృతి పట్ల పలువురు బాలీవుడ్ ప్రముఖులు, ఇరు తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.