తృణమూల్ కాంగ్రెస్ విస్తరణ చాలా స్పీడుగా జరుగుతోంది. తెలంగాణాలో కూడా అడుగుపెట్టాలని తృణమూల్ కాంగ్రెస్ చీఫ్, పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ డిసైడ్ అయ్యారని సమాచారం. అవకాశం ఉన్న రాష్ట్రాల్లో తన పార్టీని విస్తరించాలని డిసైడ్ చేసిన ఫైర్ బ్రాండ్ ఇప్పటికే పార్టీని గోవా, మణిపూర్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, బీహార్, మేఘాలయ, హర్యానా, త్రిపురా, అస్సా రాష్ట్రాల్లో శాఖలను ఏర్పాటు చేశారు. మణిపూర్ లో అయితే తృణమూల్ కు 12 మంది ఎంఎల్ఏలున్న విషయం తెలిసిందే.
తొందరలోనే ఎన్నికలు జరగబోయే గోవా, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో పోటీకి రెడీ అపోతోంది. ఇందులో భాగంగానే తెలంగాణా మీద కూడా మమత కన్నుపడిందట. తెలంగాణాలో కొత్తపార్టీ ఏర్పాటుకు, నిలదొక్కుకోవటానికి అవకాశం ఉందని ఫైర్ బ్రాండ్ భావిస్తున్నారట. అధికార టీఆర్ఎస్ మీద జనాల్లో ఉన్న వ్యతిరేకత, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మీద జనాల్లో అనాశక్తి ఉందనేది మమతకు వచ్చిన ఫీడ్ బ్యాకట.
ఫీడ్ బ్యాక్ చూసుకునే తెలంగాణాలో పార్టీ శాఖను ఏర్పాటుకు రెడీ అవుతున్నారు. జాతీయస్ధాయిలో కాంగ్రెస్ తరపున గ్రౌండ్ వర్క్ చేస్తున్న ఓ ఏజెన్సీతోనే ఫీడ్ బ్యాక్ కోసం మమత కూడా టైఅప్ చేసుకున్నారట. ఇదే సమయంలో తన పార్టీలోని కొందరు సీనియర్ నేతలను తెలంగాణాలో తిప్పి గ్రౌండ్ వర్క్ చేయించారట. మమత దూతలుగా వచ్చిన నేతలు టీఆర్ఎస్, కాంగ్రెస్ లోని అసంతృప్త నేతలతో ఇప్పటికే భేటీలు నిర్వహించినట్లు సమాచారం.
పై రెండుపార్టీల్లోని అసంతృప్తుల మీద ప్రధానంగా బీజేపీలోకి చేరే అవకాశాలున్నాయనే నేతలతోనే తృణమూల్ నేతలు చర్చలు జరుపుతున్నట్లు తెలుసింది. వీరికి పార్టీ తరపున అన్నీరకాల అండదండలు అందిస్తే పార్టీ ఈజీగా జనాల్లోకి వెళ్ళిపోతుందని ఫైర్ బ్రాండ్ ఆలోచిస్తున్నారట. అన్నీ కుదిరితే వచ్చే ఎన్నికలనాటికే తృణమూల్ తరపున అభ్యర్ధులను రెడీ చేసి పోటీచేయించాలని మమత గట్టిగా అనుకుంటున్నారట.
అందుకనే కొత్తగా నేతలను తయారుచేసుకునే బదులు ఇప్పటికే వివిధ పార్టీల్లో నిలదొక్కుక్కుని ఉన్న నేతలను లాగేసుకోవటం ద్వారా లబ్దిపొందవచ్చనేది మమత ఆలోచనగా తెలుస్తోంది. ఇప్పటికే రాబోయే ఎన్నికల్లో అధికారం మాదే అంటు వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రచ్చ చేస్తున్నారు. ఈ దశలో తృణమూల్ కూడా ఎంటరైందంటే ప్రతిపక్షాల మధ్య ఓట్లు చీలిపోయి అధికార టీఆర్ఎస్ కే లాభించే అవకాశం లేకపోలేదు. మరి చివరకు ఏమవుతుందో చూడాలి.