దేశంలో ఎన్నికలకు రంగం రెడీ అయింది. త్వరలోనే అంటే.. ఫిబ్రవరి చివరి వారంలోనే ఎన్నికలు షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలతోపాటు.. ఏపీ, పొరుగునే ఉన్న ఒడిశా, ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్, సిక్కింలలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా ఏప్రిల్, మే నెలల్లోనే ఎన్నికలకు ముస్తాబవుతున్నాయి. అయితే.. ఏ రాష్ట్రంలోనూ లేనంత పొలిటికల్ హీట్.. ఏపీలోనే కనిపిస్తోంది.
దీనికి కారణం.. ఇక్కడ అనూహ్యంగా మారిన రాజకీయ సమీకరణలే. నిన్న మొన్నటి వరకు టీడీపీ, జనసేన, బీజేపీ, కమ్యూనిస్టులు మాత్రమే పోటీలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ రంగంలో ఉన్నా.. విభజన నేపథ్యంలో ఆ పార్టీ డమ్మీ అయిపోయింది. దీంతో వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేనలను వైసీపీ సునాయాసం గా ఓడించేయడం ఖాయమని ఆ పార్టీ నేతలు అనుకున్నారు. తమ పథకాలు, సంక్షేమం వంటివి పనిచేస్తాయని లెక్కలు వేసుకున్నారు.
కానీ, టీడీపీ-జనసేన మిత్ర పక్షం ప్రకటన దరిమిలా.. వైసీపీ అంతర్మథనంలో చిక్కుకుంది. ఉమ్మడి పోరుతో ఓటు చీలిక ఉండదు కనుక.. తమకు ఇబ్బంది తప్పదని లెక్కలు వేసుకుంది. ఇక, మిత్రపక్షం టీడీపీ-జనసేన గెలుపు ఖాయమనే దిశగా అడుగులు వేస్తున్నాయి. దీంతో అప్పటి నుంచి ఏపీలో పొలిటికల్ సెగ పెరిగింది. అయితే.. ఈ సెగ కాస్తా.. ఇప్పుడు భోగి మంటలను తలపిస్తోంది. దీనికి మరో కారణం.. జగన్ వదిలిన ఒకప్పటి బాణం.. ఇప్పుడు కాంగ్రెస్ రూపు రేఖలతో ఏపీలో అడుగు పెట్టడమే.
కాంగ్రెస్ పార్టీ చీఫ్గా పగ్గాలు చేపట్టినసీఎం జగన్ చెల్లెలు, వైఎస్ షర్మిల.. దూకుడు పెంచారు. ఫైర్ బ్రాం డ్ మాదిరిగా రాజకీయాలు చేస్తున్నారు. అడుగడుగునా.. విమర్శలు గుప్పిస్తున్నారు. సవాళ్లు రువ్వుతున్నారు. దీంతో రాజకీయ కాక ఓ రేంజ్ నుంచి మరోరేంజ్కు వెళ్లిపోయింది. దీంతో నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నప్పటికీ.. ముఖ్యమైన ఒడిశాలో రాజకీయ సమీకరణలు మారి.. పొరుగు రాష్ట్రం తమిళనాడుకు చెందిన ఐఏఎస్ అధికారి.. రాజకీయాల్లోకి వచ్చి అధికార పార్టీని శాసిస్తున్నప్పటికీ.. లేని వేడి.. ఒక్క ఏపీపైనే ఉండడంతో మెజారిటీ జాతీయ మీడియా అంతా ఏపీ పైనే దృష్టి పెట్టింది. ఇదీ.. సంగతి!