ప్రఖ్యాత సర్వే సంస్థ సెంటర్ ఫర్ నేషనల్ ఒపీనియన్ స్టడీస్ (సీఎన్ఓఎస్) కొద్ది రోజుల క్రితం చేపట్టిన సర్వేలో జగన్ కు షాక్ తగిలిన సంగతి తెలిసిందే. జనాదరణలో జగన్ ఢమాల్ అయ్యారని, సర్వేలో ఏపీ సీఎం దాదాపు అట్టడుగున నిలిచారని ఆ సంస్థ వెల్లడించింది. ఈ సర్వేలో జగన్ 20వ స్థానంలో నిలిచారని, అంటే, సీఎంల జాబితాలో అట్టడుగు నుంచి ఆరో స్థానంలో ఉన్నారని తేలింది. ఇక, రాష్ట్రంలో 39 శాతం మంది మాత్రమే జగన్ నాయకత్వంపై సంతృప్తి వ్యక్తం చేశారని, 29 శాతం మంది అసంతృప్తి వెలిబుచ్చారని, మిగిలిన 32 శాతం మంది తటస్థంగా ఉండిపోయారని సర్వేలో వెల్లడైంది.
ఈ సర్వేతో పాటు గత రెండేళ్లుగా జగన్ పాలనపై తీవ్ర విమర్శలు వస్తోన్న సంగతి తెలిసిందే. అందినకాడికి అప్పులు చేసుకుంటూ పోతోన్న జగన్…చివరకు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెడుతున్నారని విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే జగన్ గ్రాఫ్ నానాటికీ పడిపోతోందన్న టాక్ వచ్చింది. ఆ టాక్ కు తగ్గట్లుగానే తాజాగా వెల్లడైన సర్వేలోనూ ఇదే విషయం వెల్లడికావడం విశేషం.
ఈ సర్వేలతోపాటు రాబోయే ఎన్నికల్లో జగన్ కు ఏ ప్రాంతంలో ఎన్ని సీట్లు వచ్చే అవకాశముందన్న విషయంపై పొలిటికల్ ఎనలిస్ట్ పీకే కూడా గతంలో సర్వే చేశారని, ఆ సర్వేలో జగన్ కు షాక్ తగిలే విషయాలు వెల్లడయ్యాయని టాక్ వచ్చింది. ఈ క్రమంలోనే పీకే సర్వే గురించి టీడీపీ జోనల్ హెడ్, ఉత్తరాంధ్ర ఇంఛార్జ్ బుద్దా వెంకన్న సంచలన విషయాలు వెల్లడించారు. ఉత్తరాంధ్రలోని 34 నియోజకవర్గాల్లో 28 చోట్ల టీడీపీ గెలుస్తుందని పీకే ఇచ్చిన రిపోర్ట్ లో ఉందని బుద్ధా అన్నారు. ప్రశ్నించిన వారిపై తప్పుడు కేసులు పెడుతున్నారని, రాబోయే ఎన్నికల్లో జగన్ను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని నాశనం చేసిన జగన్…పేదలకు డబ్బులిస్తూ ఉద్దరిస్తున్నానని గొప్పలకు పోతున్నారని మండిపడ్డారు.
టీడీపీ ఉత్తరాంధ్రలో కొత్త వ్యూహాన్ని అమలు చేయబోతోందని, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా టీడీపీ సిద్దంగా ఉందని టీడీపీ నేత కళా వెంకట్రావు అన్నారు. నీరో చక్రవర్తిలా సీఎం తాడేపల్లిలో ఉంటున్నారని, పోలవరం నిర్వాసిత గ్రామాల ప్రజలు తిరిగి తెలంగాణకు వెళ్లిపోతామనడం ప్రభుత్వానికి సిగ్గు చేటని మండిపడ్డారు. రోడ్లపై నాట్లు వేసుకునే పరిస్ధితి వచ్చిందని.. వరద సాయం కోసం నిలదీస్తే కలెక్టర్లే వెనుదిరిగిన పరిస్థితి ఉందని అన్నారు.