ఏపీ అసెంబ్లీ సమావేశాలు నేడు హాట్ హాట్ గా ప్రారంభం అయ్యాయి. మొదట ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ఇవ్వడం జరిగింది. ఇదిలా ఉంటే.. అసెంబ్లీలో ఓ ఆసక్తికర సీన్ చోటు చేసుకుంది. ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు వైఎస్ జగన్ తో మాటలు కలిపి సభలోని సభ్యులందరికీ ఫోకస్ అయ్యారు. గతంలో వైసీపీ రెబల్ ఎంపీగా ఉన్న రఘురామ.. తర్వాత సొంత పార్టీకే వ్యతిరేకం అయ్యారు.
వైకాపా హయాంలో జగన్ ప్రమేయంతోనే తనపై హత్యాయత్నానికి కుట్ర జరిగిందంటూ రఘురామ కృష్ణరాజు ఆరోపణలు చేశారు. వైసీపీని వీడి గత ఎన్నికల్లో టీడీపీ తరఫున ఉండి అభ్యర్థిగా పోటీ చేసి విషయం సాధించారు. ఎన్నికల తర్వాత కూడా జగన్ పై నిప్పులు చెరిగిన రఘురామ.. తాజాగా అసెంబ్లీలో ఆయన వద్దకే వెళ్లి పలకరించారు.
హలో జగన్ అంటూ భుజంపై చెయ్యేసి మరీ మాట్లాడాడు. ఒక రకంగా ఇది జగన్ కు సైతం ఆశ్చర్యాన్ని కలిగించింది. కొన్ని నిమిషాల పాటు ఇద్దరి మధ్య సంభాషణ జరిగింది. `రోజూ అసెంబ్లీకి రా జగన్’ అని రఘురామ కోరగా.. `రెగ్యులర్ వస్తాను…మీరే చూస్తరుగా` అని జగన్ వినమ్రంగా బదులిచ్చారు.
ప్రతిపక్షం లేకపోతే ఎలా.. ఒకరకంగా ప్రతిపక్షం ఉంటేనే అసెంబ్లీలో సమావేశాలు మజాగా ఉంటాయన్నట్టుగా రఘురామ జగన్ తో అన్నారట. జగన్ చేతిలో చేయి వేసి మరీ ఆయన మాట్లాడటం మరొక విశేషం. ఇక అక్కడితో ఆగని రఘురామ.. అటుగా వెళుతున్న ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ను తనకు జగన్ పక్కనే సీటు వేయించాలని కోరారు. తప్పని సరిగా అంటూ లాబీల్లో నవ్వుకుంటూ అక్కడి నుంచి కేశవ్ వెళ్లిపోయారు.