దేశ రాజకీయాలు ఆసక్తికరమైన మలుపు తిరగనున్నాయా? కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారును ఎదురించే దిశగా ప్రాంతీయ శక్తులు ఏకమవుతున్నాయా? జాతీయ స్థాయిలో కార్యాచరణకు వేగంగా అడుగులు పడుతున్నాయా? తెరవెనుక వ్యూహాలు చకచకా కదులుతున్నాయా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు.
త్వరలో ఢిల్లీ వేదికగా విపక్ష పార్టీల సీఎంలు భేటీ కానుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. పైగా.. అటు నుంచి మమతాబెనర్జీ, దక్షిణాది నుంచి కేసీఆర్, స్టాలిన్ వంటివారు.. మోడీ కేంద్రంగా రాజకీయ వ్యూహాలకు పదును పెట్టడం జాతీయస్థాయిలో చర్చకు దారితీస్తోంది.
బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తమిళనాడు సీఎం స్టాలిన్.. ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. కేంద్రంలోని మోడీ సర్కారుకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు. జాతీయ స్థాయిలో చక్రం తిప్పాలని ఊవిళ్లూరుతున్నారు. బీజేపీని, మోడీని ఢీకొట్టాలని బలంగా నిశ్చయించుకున్న వారిలో బంగాల్ సీఎం మమతా బెనర్జీ ముందున్నారు.
2021లో ఎన్నికల విజయం తర్వాత జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేక పార్టీలకు ఆశా కిరణంగా మారారు. ఈ క్రమంలోనే బెనర్జీ ఇప్పుడు చకచకా అడుగులు వేస్తున్నారు. బీజేపీ-కాంగ్రెస్సేతర ముఖ్యమంత్రులతో సంప్రదింపులు జరుపుతున్నారు.
తెలంగాణ, తమిళనాడు ముఖ్యమంత్రులతో మాట్లాడినట్లు ఆమ తాజాగా చెప్పారు. దేశ సమైక్య విధానాన్ని కాపాడేందుకు తాము కృషి చేస్తున్నామని చెబుతున్నారు. ఇక, కేసీఆర్ విషయానికి వస్తే.. ‘మీరు అనుమతిస్తే ఢిల్లీ కోటలు బద్ధలుకొడతా. జనం కోరితే జాతీయ పార్టీ పెడతా. కేంద్రం అవినీతిని బయటపెడతా’.. ఇవి బీజేపీని లక్ష్యంగా చేసుకొని సంధించిన వరుస విమర్శనాస్త్రాలు తెలిసిందే. దేశవ్యాప్త రాజకీయాలకు కేసీఆర్ రంగం సిద్ధం చేసుకుంటున్నారని ఈ వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. దీదీతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ఆయనే స్వయంగా వెల్లడించారు.
ఈ నేపథ్యంలోనే గతమూడు రోజులుగా వరుస పెట్టి బీజేపీపై కేసీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. రఫేల్ వివాదం, మతకల్లోలాలు, అవినీతి అంటూ కేంద్రంపై నిప్పులు చెరుగుతున్నారు. అమెరికా ఎన్నికల సమయంలో నిర్వహించిన హౌడీ మోడీ సభను వ్యూహాత్మక తప్పిదంగా అభివర్ణిం చారు. ఇక, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ సైతం వీరికి జతకలిశారు. బంగాల్లో గవర్నర్ జగ్దీప్ ధన్కడ్ వ్యవహారాన్ని తప్పుబడుతూ ట్వీట్ చేశారు. ముందస్తు సమాచారం లేకుండా అసెంబ్లీ సమావేశాలను ముగిస్తూ గవర్నర్ నిర్ణయం తీసుకోవడాన్ని ఆక్షేపించారు.
నిజానికి కాంగ్రెస్ లేని విపక్ష కూటమి ఎలా ఉంటుందోనని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. కాంగ్రెస్ను తమతో చేతులు కలపాలని కోరామని మమత చెబుతున్నారు. అయితే వారు మాత్రం సొంతదారిలోనే వెళ్తున్నారని, వారు వినకపోతే చేసేదేం లేదని అన్నారు. కాంగ్రెస్తో మమత అంటి ముట్టనట్టుగానే ఉంటున్నారు. కాంగ్రెస్ నేతృత్వంలో విపక్ష కూటమి ఏర్పాటు కాదనే ఆలోచనతో ఉన్నారు. తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకేకు… కాంగ్రెస్తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.
కాంగ్రెస్ మద్దతుతోనే మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే సీఎం కుర్చీ దక్కించుకున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం కాంగ్రెస్ను దూరంగానే పెట్టారు. బీజేపీ-కాంగ్రెస్కు సమదూరం పాటిస్తామని కేసీఆర్ తరచుగా చెప్పే మాట. అయితే, గత రెండ్రోజులుగా బీజేపీని తూర్పరాబట్టిన కేసీఆర్.. పలు విషయాల్లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి బాసటగా నిలిచారు.
అసోం సీఎం రాహుల్పై చేసిన వ్యాఖ్యలను ఖండించారు. మరోవైపు, సున్నితమైన సర్జికల్ స్ట్రైక్స్ అంశంపై రాహుల్ గాంధీ రుజువులు అడగటాన్ని సమర్థించారు. దీనిని బట్టి.. తమ కూటమిలోకి కాంగ్రెస్ను చేర్చుకునే ఉద్దేశం ఉందని పరోక్షంగా కేసీఆర్ తేల్చేశారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.