అనూహ్యంగా తెర మీదకు వచ్చిన విశ్వసుందరి సుస్మితా సేన్ తాజా డేటింగ్ వ్యవహారం అందరిని ఆశ్చర్యానికి గురి చేయటమే కాదు.. లేటు వయసులో వాటే ఘాటు ప్రేమ అన్న మాట పలువురి నోట వచ్చేలా చేసింది. తన కంటే వయసులో బాగా పెద్ద వాడైన లలిత్ మోడీతో నడిపిస్తున్న డేటింగ్.. త్వరలోనే పెళ్లి అన్న సందేశాలతో సోషల్ మీడియాలో భారీ చర్చే నడుస్తోంది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. తన ప్రేమను దక్కించుకోవటం కోసం లలిత్ మోడీ చాలా గట్టిగానే ప్రయత్నించినట్లున్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
ఇదిలా ఉంటే.. దాదాపు తొమ్మిదేళ్ల క్రితం లలిత్ మోడీ చేసిన ట్వీట్ ఇప్పుడు వెలుగు చూడటమే కాదు.. అది కాస్తా వైరల్ గా మారింది. 2013లో లలిత్ మోడీ ఒకసారి సుస్మితతో.. ‘ఓకే ఐ కమిట్’ అని పేర్కొంటే.. దీనికి సుస్మిత మాత్రం.. ‘మీరు చాలా మంచివారు.హామీలను నిలబెట్టుకోలేకపోవచ్చేమో కానీ కమిట్ మెంట్లను మాత్రం గౌరవించాల్సిందే’ అంటూ రిప్లై ఇచ్చింది. అంతేకాదు.. మరో ట్వీట్ లో సుస్మితను ట్విటర్ లో కాకుండా ఎస్ఎంఎస్ ద్వారా రిప్లై ఇవ్వాలని కోరిన ట్వీట్ కు సంబంధించిన స్క్రీన్ షాట్ వైరల్ గా మారింది.
ఈ ట్వీట్లను చూపిస్తూ.. తమకు తోచిన రీతిలో వ్యాఖ్యలు చేస్తున్నారు నెటిజన్లు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఈ ప్రేమాయణంపై మరో ఆసక్తికర వ్యాఖ్య నడుస్తోంది. రీల్ లో హీరోయిన్ పాత్రలతో కోట్లాది మంది మనసుల్ని దోచేసిన సుస్మిత.. రియల్ లైఫ్ లో మాత్రం తన ప్రేమను రియల్ ‘విలన్’తో పంచుకోవటం ఏమిటి? అన్న ప్రశ్నను సంధిస్తున్నారు.
లలిత్ మోడీ విలన్ ఎలా అన్నంతనే.. మనీ లాండరింగ్ కేసులో భారత్ నుంచి పారిపోయిన అతగాడు 2010 నుంచి లండన్ లోనే ఉంటున్న సంగతి తెలిసిందే. 1991లో లలిత్ మోడీ మినాల్ మోడీని పెళ్లాడటం.. క్యాన్సర్ కారణంగా 2018లో ఆమె మరణించటం తెలిసిందే. ఈ వ్యక్తిగత విషయం సంగతి ఎలా ఉన్నా.. వేలాదికోట్లకు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులు ఉన్న ‘విలన్’ను సుస్మిత లాంటి విశ్వసుందరి తన మనసును ఇచ్చేయటం ఏమిటి చెప్మా? అన్న ప్రశ్నను సంధిస్తుంటే.. ప్రేమ గుడ్డిదని ఊరికే అనలేదన్న కొంటె వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇక, లలిత్ మోడీతో డేటింగ్ పై మాజీ మిస్ వరల్డ్ నో కామెంట్ అంటుండడం కొస మెరుపు.