దేవుడినే సవాల్ చేస్తూ…తనకు నష్టపరిహారం చెల్లించాల్సిందేనంటూ హిందీలో OMG, తెలుగులో గోపాల గోపాల సినిమాల వెంకటేష్ పాత్ర గోల గోల చేసిన సంగతి తెలిసిందే. యాక్ట్ ఆఫ్ గాడ్ కింద బీమా వర్తించదని బీమా కంపెనీ చెప్పడంతో….దేవుళ్లపైనే కేసు పెట్టి కోర్టుకు లాగి రచ్చ రచ్చ చేయడమే ఇతివృత్తంగా ఆ సినిమా తెరకెక్కింది. అయితే, రీల్ లైఫ్ లోనే కాదు…రియల్ లైఫ్ లోనూ తాజాగా దేవుడికి సమన్లు పంపిన ఘటన తీవ్ర చర్చనీయాంశమైంది.
ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గఢ్ జిల్లాలో ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైందని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ప్రభుత్వ భూమిని కొందరు ఆక్రమించుకున్నారని రాయ్‌గఢ్‌లోని 25వ వార్డుకు చెందిన సుధా రజర్వాడే పిటిషన్ వేశారు. అంతేకాదు, ఆ పిటిషన్ లో శివాలయంతో పాటు మొత్తం 16 మందిని నిందితులుగా పేర్కొన్నారు. ఈ భూ ఆక్రమణలపై నిజానిజాలు నిగ్గు తేల్చాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారానికి సంబంధించి రెవెన్యూ అధికారులు చేసిన పని హాట్ టాపిక్ గా మారింది. ఈ కేసుకు సంబంధించి ప్రభుత్వ అధికారులు 10 మందికి సమన్లు ఇవ్వగా, వారిలో ఆరవ నిందితుడిగా శివుడికి సమన్లు జారీ కావడం కలకలం రేపింది. అంతేకాదు, ఈ నెల 25లోగా విచారణకు హాజరుకావాలని, లేకుంటే ఆ భూమిని బలవంతంగా ఖాళీ చేయించి రూ.10 వేల జరిమానా విధిస్తామని వార్నింగ్ కూడా ఇచ్చారు.
అయితే, శివాలయాన్ని పిటిషనర్ నిందితుడిగా పేర్కొనడంతోనే తాము సమన్లు పంపించాల్సిన పరిస్థితి వచ్చిందని అధికారులు చెబుతున్నారు. దీంతో, ఈ ఘటనపై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వ అధికారులకు పైత్యం ఎక్కువైందని, అందుకే OMG వంటి సినిమాల నుంచి స్ఫూర్తి దేవుడికి సమన్లు పంపడమేమిటని ఫైర్ అవుతున్నారు. గుడి మాన్యానికి సంబంధించిన వ్యక్తులకో, ఆ భూమికి సంబంధించిన వారికో సమన్లు పంపితే సరిపోయేదని అంటున్నారు. ఏది ఏమైనా ఈ వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ అయింది.