అనంతపురంలోని ఎస్ఎస్ బీఎన్ కాలేజీలో విద్యార్థులపై లాఠీచార్జి ఘటన ఏపీలో దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఎయిడెడ్ విద్యాసంస్థల విలీనాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు చేపట్టిన నిరసన ఉద్రిక్తంగా మారడం, జయలక్ష్మి అనే విద్యార్థిని తలకు గాయం కావడం, ఆమె అదృశ్యం అయి తిరిగి ప్రత్యక్షం కావడం వంటి పరిణామాలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా విజయవాడలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌కు ఎయిడెడ్ నిరసనల సెగ తగిలింది.
పీజీసెట్ ఫలితాలను విడుదల చేస్తున్న మంత్రి సురేశ్ సమావేశాన్ని విద్యార్థి సంఘాలు, విద్యార్థులు అడ్డుకున్నారు. సమావేశం మధ్యలో హఠాత్తుగా హాల్ లోకి నినాదాలు చేసుకుంటూ వచ్చని టీఎన్ఎస్ఎఫ్, ఏఐఎస్ఎఫ్, పీడీఎస్‌యూ విద్యార్థి సంఘాల నాయకులు…ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ చేతిలోని బ్యానర్లు ప్రదర్శిస్తూ ఆందోళనకు దిగారు.
ఆందోళన చేస్తున్న విద్యార్థుల దగ్గరకు వెళ్లి సురేశ్ మాట్లాడారు. విద్యార్థిని జయలక్ష్మిని పోలీసులు కొట్టలేదని, ఎవరో రాయి విసరడంతోనే ఆమెకు గాయమైందని వివరించారు. ఎయిడెడ్ కళాశాలల విలీనంతో నష్టం లేదని, ఫీజులను ప్రభుత్వమే ఇస్తుందని సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అయితే, అనంతపురంలో విద్యార్థులపై పోలీసుల దాడిని విద్యార్థులు ఖండించారు. జీవో.46ను తక్షణం రద్దుచేసి, విలీనం ఆపేయాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా విద్యార్థులకు, మంత్రి సురేశ్ కు మధ్య వాగ్వాదం జరిగింది. చివరకు పోలీసులు వచ్చి ఆందోళనకారులను బలవంతంగా లాక్కెళ్లి వాహనాల్లో తరలించారు. ఆ దాడి ఘటన… ప్రతిపక్షాలు, చంద్రబాబు కుట్రేనని సురేశ్ ఆరోపించారు. ఎయిడెడ్ కళాశాలల విలీనాన్ని రాజకీయం చేస్తున్నారన్నారు.