రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. అసాధ్యమన్నది ఉండదు. కాస్తంత కాలం కలిసి వస్తే చాలు.. కలలో కూడా ఊహించనివి కూడా చోటు చేసుకుంటాయి. ఆ విషయంలో ఎవరికి ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు. 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న నాటితో పోలిస్తే.. 2009 ఎన్నికల అనంతరం ఆయన ఇమేజ్ ఎంతలా పెరిగిపోయిందన్న విషయమే కాదు.. అప్పట్లో కేసీఆర్ లాంటి నేతల పరిస్థితి ఎంత గడ్డుగా ఉండేదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు.
అప్పట్లో కేసీఆర్ గురించి ఎవరూ అంచనా వేయలేకపోయారు. అప్పట్లో అత్యంత బలహీనంగా ఉన్న కేసీఆర్.. ఇవాల్టి రోజున ఎంత బలోపేతమైన అధినేతగా అవతరించారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
దేశంలోని మరే రాష్ట్రంలోని ముఖ్యమంత్రి సంగతి అయినా సరే.. ఇట్టే లెక్క తేల్చేసే మోడీషాలు.. కేసీఆర్ విషయానికి వచ్చినప్పుడు మాత్రం ఆచితూచి అన్నట్లుగా రియాక్టు కావటం చూస్తున్నదే. ఇదంతా ఎందుకంటే.. రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. కాలానికి అనుగుణంగా మారిపోతుంటాయి.
సరిగ్గా ఇప్పుడు అలాంటి విషయాన్ని తనదైన శైలిలో చెప్పుకొచ్చారు టీ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి. రెండు రోజుల పాటు ప్రగతిభవన్ లో సుదీర్ఘంగా సాగిన కేసీఆర్ – పీకే మధ్య చర్చలకు సంబంధించి ఇప్పటికే బోలెడు వార్తలు.. విశ్లేషణలు రావటం తెలిసిందే.
తాను కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికి తన సంస్థ మాత్రం తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి రాజకీయ వ్యూహాల్ని సమకూర్చటంతో పాటు.. ఎన్నికల వేళ సహకరిస్తుందంటూ ఒప్పందం చేసుకోవటం తెలిసిందే. ఈ వ్యవహారం ఇప్పుడు పెను సంచలనంగా మారింది. ఓవైపు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్న పీకే.. మరోవైపు తమకు ప్రత్యర్థి అయిన టీఆర్ఎస్ కు సేవలు అందించటం ఏమిటన్న సందేహాలు వ్యక్తం కావటంతో పాటు.. ఇలాంటి పరిస్థితులపై ఏమని రియాక్టు కావాలి? అన్న గందరగోళంలో పడిపోయారు కాంగ్రెస్ నేతలు.
ఇలాంటి వేళలోనూ తనదైన వాదనను బలంగా వినిపించే రేవంత్.. ఆసక్తికర వాదనను వినిపించారు. టీఆర్ఎస్ తో తెగతెంపులు చేసుకునేందుకే సీఎం కేసీఆర్ ను పీకే కలిసినట్లుగా పేర్కొన్నారు. రానున్న రోజుల్లో టీఆర్ఎస్ తోనూ ఐప్యాక్ సంస్థతోనూ పీకేకు ఎలాంటి సంబంధం ఉండదన్న ఆయన.. తాను ముందు నుంచి చెబుతున్నదే ఇప్పుడు జరుగుతుందన్నారు. పీకే కాంగ్రెస్ లో చేరిన తర్వాత ఆయనే స్వయంగా రాష్ట్రానికి వచ్చి టీఆర్ఎస్ ను ఓడించమని ఆయన నోటి నుంచి వింటారని వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత పీకే కు పార్టీ అధినాయకత్వమే ఫైనల్ అవుతుందని.. అలాంటప్పుడు ఆయన కాంగ్రెస్ విజయం కోసమే పని చేస్తారని చెప్పుకొచ్చారు. ఏమైనా.. రేవంత్ ఇప్పుడు చెప్పినట్లుగా చేతల్లో చేసి చూపిస్తే మాత్రం.. ఆయన మామూలోడు కాదని మాత్రం చెప్పక తప్పదు. అంతేకాదు.. ఆ సమయంలో రెండు రోజుల పాటు పీకేతో కేసీఆర్ ఏం మాట్లాడారన్న విషయాలు కూడా బయటకు వస్తాయేమో? ఏమైనా.. రాజకీయంగా రానున్న రోజులు మరింత వాడివేడిగా ఉంటాయని మాత్రం చెప్పకతప్పదు.