సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు హీరో అల్లు అర్జున్ ప్రధాన కారణమని ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ పై కేసు నమోదు కాగా ఆయన ప్రస్తుతం మధ్యంతర బెయిల్ పై ఉన్నారు. తనకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాలంటూ అల్లు అర్జున్ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ పై విచారణ నాలుగు రోజుల క్రితమే పూర్తికాగా ఈ రోజు తీర్పు వెలువడింది.
అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. రూ.50 వేల రూపాయల సొంత పూచీకత్తుతో పాటు 2 సాక్షి సంతకాలతో బెయిల్ మంజూరు చేసింది న్యాయస్థానం. అంతేకాదు, ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు అల్లు అర్జున్ హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. కోర్టు తీర్పుతో అల్లు అర్జున్ కు బిగ్ రిలీఫ్ లభించినట్లయింది.
ఇదే కేసులో పుష్ప చిత్ర నిర్మాతలకు ఊరట లభించింది. ఈ ఘటనలో నిర్మాతలను నిందించవద్దని కోర్టు చెప్పింది. అంతేకాదు, నిర్మాతలు రవి, నవీన్ లను అరెస్ట్ చేయొద్దని ఇంటరిమ్ ఆర్డర్ జారీ చేసింది. కౌంటర్‌గా పోలీసులు అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.