సూటిగా.. స్పష్టంగా మాట్లాడుకుందాం. ఇక్కడ ఎవరికి ఎలాంటి రాజకీయ ఎజెండాలు లేవు. కాకుంటే.. పరిధి దాటి.. గీతల్ని చెరిపేస్తూ.. దరిద్రపుగొట్టు సంప్రదాయాల్ని తెర మీదకు తీసుకురావటం ద్వారా కొత్త దుర్మార్గాలకు తెర తీసినప్పుడు.. మిగిలిన వారంతా ఈవిషయం మీద మాట్లాడుకొని.. ఒక మాట అనుకోవాల్సిన బాధ్యత అందరి మీదా ఉంటుంది.
పవన్ వైసీపీ నేతల్ని ఘాటుగా తిట్టారు. అందులో ఎక్కడా అన్ పార్లమెంటరీ పదాలు వాడలేదు కదా? విమర్శను విమర్శగా తీసుకొని.. అందుకు తగ్గట్లు కౌంటర్ ఇవ్వటం తప్పేం కాదు. ఎవరూ దాన్ని తప్పు పట్టరు.
కానీ.. నోటికి వచ్చినట్లు మాట్లాడి.. రోడ్డు మీదకు వచ్చి వీరంగం వేయటం ఎంతవరకు సబబు? ఒక నటుడిగా.. ఒక రచయితగా.. ఒక సెలబ్రిటీగా.. రోజుకు నాలుగైదు లక్షల రెమ్యునరేషన్ (ఇండస్ట్రీ మాట. నిజం ఎంతన్నది మళ్లీ చెక్ చేస్తే మంచిది) తీసుకునే పోసాని కృష్ణమురళినే తనను తాను సంభాళించుకోలేక.. అడ్డదిడ్డంగా మాట్లాడితే.. పోసాని మాదిరి అవగాహన పెద్దగా లేక.. కేవలం అభిమానం అన్నదే నమ్ముకునే ఫ్యాన్స్ కాస్త ఎక్కువ తక్కువ మాట్లాడొచ్చు.
ఎందుకంటే.. సమాజంలో ఉన్నత స్థానాల్లో ఉన్న వారే స్థిమితాన్ని కోల్పోయినప్పుడు.. సమాజంలో పేరు ప్రఖ్యాతులు లేని.. ఎదో తమ బతుకు తాము బతికేసేటోళ్లు.. తాను అన్న మాటలకు స్పందించి.. ఒక మాట అంటే.. దానికి పవన్ ఎంతవరకు బాధ్యుడు?
జగన్ మీద ఎవరైనా ఏమైనా అంటే.. సుప్రీంకోర్టు జడ్జిని కూడా వదిలిపెట్టకుండా పోస్టులు పెట్టేశారు. అలా అని.. ఆయన్ను.. ఆయన ఇంట్లో వారిని.. కుటుంబ సభ్యుల్ని నోటికి వచ్చినట్లుగా అనేస్తారా? అలా అనటం అసలు ధర్మం అవుతుందా? పోసాని వాదనకు సంబంధించిన కీలకమైన బలహీనత కోణం ఇక్కడే కనిపిస్తుంది. పవన్ అభిమాని అన్న ట్యాగ్.. నిజమైన అభిమాని అయి ఉండొచ్చు.
ఆయన రాజకీయ ప్రత్యర్థులు.. పవన్ అభిమాని అన్న ట్యాగ్ తగిలించుకొని ఆయన్ను డ్యామేజ్ చేయటానికి ప్రయత్నం చేయొచ్చు కదా? అలాంటి కుట్రలు తరచూ సినిమాల్లో బోలెడన్ని సార్లు చూపిస్తుంటారు కదా? మరి.. అలాంటప్పుడు పోసానిని తిట్టే వారంతా పవన్ ఫ్యాన్సే అని ఎలా చెప్పగలం?
పవన్ ఫ్యాన్స్ తన భార్య గురించి చెడుగా మాట్లాడారని పోసాని తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నిజానికి.. అలాంటి పోస్టులు ఏమీ పెద్దగా కనిపించలేదు. నిజంగానే అంత దారుణంగా ఉంటే.. ఇప్పుడున్న సోషల్ మీడియా విస్త్రతికి ఎప్పుడో బయటకు వచ్చేవి.
కానీ.. అలాంటి ఉందో లేదో తెలీని పోస్టు గురించి ప్రస్తావిస్తూ.. పవన్ తల్లిని ఎలా పడితే అలా తిట్టేయటం ఎంతవరకు సబబు? అన్నది ప్రశ్న. ఈ మొత్తం ఎపిసోడ్ లో పవన్ తల్లిని మాత్రమే కాదు.. భార్యను కూడా తిట్టేస్తానంటూ పోసాని లాంటి వారు ఎలా అనగలరు? అంటే.. ఆవేశంతో తనకు తోచినట్లుగా మాట్లాడేసే సెలబ్రిటీ మాటలు.. సమాజానికి చెడు సందేశాన్ని ఇవ్వటమే కాదు.. సంకేతాల్ని కూడా ఇస్తున్నాయన్నది మర్చిపోకూడదు.
ఇలాంటి మాటలకు.. ఆవేశాలకు మొదట్లోనే చెక్ చెప్పకుంటే.. తర్వాతి కాలంలో ఇలాంటి వాటిని కంట్రోల్ చేయలేక తీవ్ర ఇబ్బందులకు గురి కావాల్సి వస్తోందన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.