టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ భేటీ కావడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దాదాపు 3 గంటల పాటు తాడేపల్లిలోని చంద్రబాబు నివాసంలో వీరిద్దరి భేటీ కొనసాగింది. అంతకుముందు లోకేష్ తో కలిసి చంద్రబాబు నివాసానికి పీకే వెళ్లారు. ఈ క్రమంలోనే చంద్రబాబుతో చర్చ సందర్భంగా ఏపీ ప్రభుత్వంపై లోతైన విశ్లేషణతో కూడిన నివేదికను చంద్రబాబుకు పీకే సమర్పించినట్లుగా తెలుస్తోంది.
ప్రభుత్వంపై యువత తీవ్ర అసంతృప్తితో ఉందని, దాంతోపాటు నిత్యావసర సరుకుల ధరల పెంపు, కరెంటు చార్జీల పెంపు, పన్నుల బాదుడు, నిరుద్యోగం వంటి అంశాలు వైసీపీకి ప్రతికూలంగా మారబోతున్నాయని పీకే వెల్లడించినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా, దళితులు బీసీలపై దాడులు కూడా వైసీపీకి ప్రతికూలంగా మారినట్లు ఆ నివేదికలో పీకే ప్రస్తావించారని తెలుస్తోంది. ఒకరిద్దరూ మంత్రులను మినహాయిస్తే చాలామంది మంత్రులకు సున్నా మార్కులు పడ్డాయని, అహంకార ధోరణితో ప్రభుత్వం ఉందన్న భావన ప్రజల్లో ఉందని చంద్రబాబుతో పీకే చెప్పినట్లు తెలుస్తోంది.
ప్రభుత్వ వ్యతిరేకతను, వ్యతిరేక ఓట్లను అనుకూలంగా మలుచుకునేందుకు ప్రతిపక్షం తగిన వ్యూహ రచన చేసుకోవాలని, యువతను ఆకట్టుకునేలాగా కార్యచరణను టీడీపీ రూపొందించాలని పీకే సూచించినట్లుగా తెలుస్తోంది. చంద్రబాబు అరెస్ట్ తర్వాత తటస్థ ఓటర్లలోనూ, వైసీపీ వర్గంలోని కొంతమందిలోనూ జగన్ పై వ్యతిరేకత వచ్చిందని ఆ నివేదికలో పీకే వెల్లడించినట్టుగా తెలుస్తోంది.