ఏపీలో తమ సర్కార్ పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని వైసీపీ నేతలు ఒప్పుకుంటున్న వైనం జగన్ కు షాకిస్తున్న సంగతి తెలిసిందే. ప్రజలలో తమ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని మంత్రి ధర్మాన ప్రసాదరావు కొద్ది రోజుల క్రితం చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఇక, అధికారుల తప్పుడు నిర్ణయాల వల్లే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందంటూ అనపర్తి ఎమ్మెల్యే, వైసీపీ నేత సత్తి సూర్యనారాయణ రెడ్డి చేసిన కామెంట్లు కూడా అధికార పార్టీని ఇరుకున పడేశాయి.
ధాన్యం కొనుగోళ్లకు వలంటీర్లకు ఎలా అప్పగిస్తారని, అధికారుల తీరు మారకపోతే రైతులతో కలిసి అధికారులకు వ్యతిరేకంగా ధర్నా చేస్తానంటూ ఎమ్మెల్యే వార్నింగ్ ఇచ్చి…తమ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను కవర్ చేసుకున్న వైనం గతంలో హాట్ టాపిక్ గా మారింది. ఆ వ్యాఖ్యల దుమారం సద్దుమణగక ముందే తాజాగా జగన్ సర్కార్ పై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో చాలాచోట్ల అసమ్మతి ఉందని ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు.
ఇంకా చెప్పాలంటే జగన్ సొంత ఇలాకాతోపాటు తన నియోజకవర్గంలోనూ తనకూ అసమ్మతి ఉందని నిజాన్ని ఒప్పుకున్నారు పెద్దిరెడ్డి. అనంతపురం ఇన్ చార్జి మంత్రి హోదాలో రాప్తాడు నియోజకవర్గ వైసీపీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించిన పెద్ది రెడ్డి ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం. అయితే, పార్టీలో అసమ్మతిని పక్కనపెట్టాలని, ప్రతి నాయకుడిని కలుపుపోతూ ఎన్నికలకు సమాయత్తం కావాలని పెద్దిరెడ్డి సూచించారు.
ఇక, రాప్తాడులో వైసీపీ నేతల అంతర్గత పోరుపై రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి స్పందించారు. ఎవరైనా తన స్థానంలోకి వచ్చి పోరాటం చేస్తామంటే పక్కన కూర్చుని మద్దతు ఇస్తానంటూ తోపుదుర్తి చేసిన వ్యాఖ్యలు షాకింగ్ గా మారాయి. రాబోయే ఎన్నికల్లో రాప్తాడు సీటును ఇతరులకు కేటాయిస్తారన్న ప్రచారం నేపథ్యంలో తోపుదుర్తి వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.