నా యుద్ధం నేనే చేస్తా.. అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్య చేశారు. నిజానికి వచ్చే ఎన్నికల్లో ఆయన పొత్తు పెట్టుకుని ముందుకు సాగుతారని అనుకుంటున్న తరుణంలో ఈ వ్యాఖ్య సంచలనమనే చెప్పాలి. అయితే, దీనివెనుక పవన్ ఉద్దేశం ఏమనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ప్రభుత్వంపై యుద్ధం చేయడంలోనే ఇలా వ్యాఖ్యానించారని.. పలువురు అంటున్నారు.
అయితే, ఇదే సందర్భంలో పవన్ మరో కామెంటు కూడా చేశారు. వచ్చే ఎన్నికల్లో జనసేన అధికారంలోకి వచ్చిన తర్వాత.. అప్పటికి జీరోలయ్యే వైసీపీ నేతలను తరిమి తరిమి కొడతామన్నారు. దీనిని బట్టి..ఆయన ఒంటరిగానే ఎన్నికలకు వెళ్లే అవకాశం స్పష్టంగా చెప్పేసినట్టు అవుతోందనే మరో వాదన కూడా వినిపిస్తోంది. ప్రస్తుతం బీజేపీతో ఆయన పొత్తులో ఉన్నారని.. ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. కానీ, ఇటీవల ఎక్కడ సభ పెట్టినా.. బీజేపీ గురించిన ప్రస్తావనను పవన్ తీసుకురావడం లేదు.
అదేసమయంలో కొన్ని వారాల కిందట.. ప్రజాస్వామ్య పరిరక్షణకు టీడీపీతో కలిసిముందుకు సాగుతామని ఆయన చెప్పారు చంద్రబాబుతోనూ చేతులు కలిపారు. ఈ రెండు పార్టీలూ కలిసి ప్రజాస్వామ్య పరిరక్షణకు ముందుకు వస్తామని అప్పట్లో ఇరువురు నేతలు ప్రకటించారు. కానీ, ఇప్పుడు పవన్ మాత్రం నాయుద్ధం నేనే చేస్తాను.. అనడం ద్వారా టీడీపీని కూడా ఆయన పక్కన పెట్టేశారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఆ రోజు తర్వాత.. మళ్లీ పవన్ చంద్రబాబు ప్రస్తావనకానీ, టీడీపీప్రస్తావన కానీ, తీసుకురాలేదు. చంద్రబాబు మాత్రం కర్నూలు పర్యటనలో పవన్ గురించి ఒక సారి ప్రస్తావించి ఆయన కూడా వదలేశారు. ఇక, తాజా వ్యాఖ్యల నేపథ్యంలో టీడీపీతోనూ పవన్ ముందుకు సాగే అవకాశం లేదని స్పష్టంగా తెలుస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. సో.. మొత్తానికి చూచాయగా వచ్చే ఎన్నికలపై పవన్క్లారిటీ ఇచ్చేశారా? లేకపోతే. . ఏం చేస్తారు? అనేది చూడాలి.
వైసీపీ ఫ్యూడలిస్టిక్ గోడలు బద్దలు కొట్టి తీరుతాం – JanaSena Chief Sri @PawanKalyan pic.twitter.com/yKqm7guMGG
— JanaSena Party (@JanaSenaParty) November 27, 2022