చైనాలో కరోనా మహమ్మారి మరోసారి విలయ తాండవం చేస్తుండడంతో ప్రపంచ దేశాలు ఉలిక్కిపడుతున్నాయి. ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బీఎఫ్-7 దెబ్బకు చైనా వణికిపోతోంది. 140 కోట్ల జనాభా ఉన్న చైనాలో రాబోయే 90 రోజులు చాలా కీలకమని, అక్కడ మూడింట ఒక వంతు ప్రజలు ఇన్ఫెక్షన్ బారిన పడతారని అమెరికాలో వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే చైనాలో ఆసుపత్రుల్లో పడకలు దొరకని పరిస్థితి ఉంది.
మరోవైపు, చైనాలో జీరో కోవిడ్ పాలసీ అమలు చేస్తుండడంపై ప్రజల్లో వ్యతిరేకత వస్తోంది. ఒక్క కేసు వచ్చినా ఆ ప్రాంతం మొత్తాన్ని కట్టడి చేసేయడంతో కరోనా వైరస్ విస్తరించకుండా చేయడంలో ప్రభుత్వం సక్సెస్ అయింది. కానీ, జీరో కోవిడ్ పాలసీతో ఉపాధి లేక, తిండికి, నీళ్లకు ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. దీంతో, చైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. జనం ఆందోళనలతో జీరో కోవిడ్ పాలసీని చైనా ఇటీవలే ఎత్తేసింది. ఆ తర్వాతే కరోనా కేసులు గణనీయంగా పెరిగిపోతుండడం కలవరపాటుకు గురిచేస్తోంది.
కాగా, చైనాలోని బీఎఫ్-7 వేరియంట్ భారత్ లోనూ వ్యాపిస్తున్న వైనం కలవరపెడుతోంది.భారత్ లో ఆ వేరియంట్ కు సంబంధించి 3 కేసులు నమోదయ్యాయి. అక్టోబరులోనే గుజరాత్ లో తొలి కేసును గుజరాత్ బయోటెక్నాలజీ సెంటర్ గుర్తించింది. రెండో కేసు గుజరాత్ లో, మరొకటి ఒడిసాలో వెలుగు చూసింది. దీంతో, ఈ వేరియంట్ పై కేంద్రం అప్రమత్తమైంది. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ అన్నారు.
కోవిడ్ పరిస్థితిపై ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం ఏర్పాటు చేసిన మాండవీయ..కరోనా కేసుల్లో పెరుగుదల ఏమీ లేదన్నారు. అయితే, కొత్త వేరియంట్లపై నిఘా ఉంచాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు హెచ్చరికలు చేశారు. కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నామని, రద్దీ ప్రదేశాల్లో ప్రజలు మాస్కులు తప్పనిసరిగా ధరించాలని స్పష్టం చేశారు.