ప్రముఖ హీరోయిన్ నిత్యా మీనన్ ను సౌత్ సినీ ప్రియులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. గ్లామర్ తో సంబంధం లేకుండా కేవలం నటనా ప్రతిభతో స్టార్ ఇమేజ్ సంపాదించుకున్న అతి కొద్ది మంది హీరోయిన్లలో నిత్యామీనన్ ఒకరు. హనుమాన్ అనే హాలీవుడ్ మూవీ తో చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన నిత్యామీనన్.. అలా మొదలైంది అనే తెలుగు సినిమాతో హీరోయిన్ గా మారింది. ఆ తర్వాత సౌత్ లోని అన్ని ప్రధాన భాషల్లోనూ నేమ్ అండ్ ఫేమ్ సంపాదించుకుంది.
నటిగానే కాకుండా సింగర్ గానూ శభాష్ అనిపించింది. ఇకపోతే అభిమానులతో సహా దాదాపు అందరూ నిత్యా మీనన్ మలయాళీ అని అనుకుంటారు. ఆమె పేరు చివర్లో మీనన్ ఉండటమే అందుకు కారణం. మీరు కూడా అలానే అనుకుంటే కచ్చితంగా మోసపోయినట్లే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిత్యా మీనన్.. అందరూ అనుకుంటున్నట్లు తాను మలయాళీ కాదని చెప్పి బిగ్ ట్విస్ట్ ఇచ్చింది.
నిత్యా మీనన్ మాట్లాడుతూ.. `నా రియల్ పేరు ఎన్.ఎస్.నిత్య. ఎన్.ఎస్ అంటే ఇంటిపేరు కాదు. ఎన్ అంటే నళిని.. మా అమ్మ పేరు. ఎస్ అంటే సుకుమార్.. మా నాన్న పేరు. మా ఫ్యామిలీలో ఇంటి పేర్లను వాడరు. కులాన్ని పేర్లతో ముడిపెట్టడం మాకు ఇష్టం ఉండదు. అయితే ఒక నటిగా షూటింగ్స్ రిత్యా దేశవిదేశాలు తిరగాల్సి ఉంటుంది.
అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో పాస్పోర్ట్ కోసం నా పేరుకు మీనన్ ని జత చేయాల్సి వచ్చింది. అది కూడా న్యూమరాలజీ ఆధారంగా పెట్టింది. దాంతో చాలా మంది నేను మలయాళీ అనుకుంటారు. వాస్తవానికి మాది బెంగళూర్. మూడు తరాల నుంచి మా ఫ్యామిలీ బెంగళూర్లోనే ఉంటోంది. స్కూల్లో నా సెకండ్ లాంగ్వేజ్ కన్నడ` అని చెప్పుకొచ్చింది. ఆమె వ్యాఖ్యలతో అభిమానులు మరియు నెటిజన్లు షాకైపోతున్నారు. ఇన్ని రోజులు నిత్య మలయాళీ అనుకుని మోసపోయామని అభిప్రాయపడుతున్నారు.