ఎప్పుడూ చూడని సన్నివేశం ఒకటి ఇప్పుడు ఆవిష్కృతమవుతుంది. టీడీపీ అధినేత చంద్రబాబును టార్గెట్ చేయటం.. ఆయన్ను విమర్శించటం.. ఆయనపై జోకులు వేయటం లాంటివి మాత్రమే వినిపించే రాజకీయాల్లో .. ఆయన అందరికి దూరంగా.. జైల్లో ఉంచేసిన వేళ.. అనూహ్యంగా యువత బయటకు రావటం.. వేదికలు కట్టి.. సభలు పెట్టి మరీ ఆయన ఘనత గురించి.. ఆయన గొప్పతనం గురించి అందరూ మాట్లాడుకునే ప్రత్యేక పరిస్థితి. కారణం ఏమైనా కానీ.. ఒక కుంభకోణం పేరుతో జైల్లో ఉంచిన చంద్రబాబు గొప్పతనం ఏమిటన్న విషయంపై.. ఆయన్ను జైల్లో ఉంచి యాభై రోజుల తర్వాత ‘సీబీఎన్ గ్రాటిట్యూడ్ కాన్సర్ట్’ ఒక భారీ సభను నిర్వహించటం చాలా అరుదుగా జరిగే కార్యక్రమంగా చెప్పాలి.
సాధారణంగా ఒక రాజకీయ పార్టీ అధినేతను జైల్లో ఉంచిన సందర్భంలో.. ఆవేశం పెల్లుబుకుతుంది. ఆగ్రహ జ్వాలలు పెల్లుబుకుతాయి. కానీ.. చంద్రబాబు అరెస్టు వేళ.. అలాంటిదేమీ జరగలేదు. అయితే.. అందుకు భిన్నంగా.. అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎంతటి రాజకీయ నేత అయినప్పటికీ జైల్లోకి వెళ్లే వేళలోనూ.. వెళ్లిన తర్వాత మొదటి నాలుగు రోజులు మాత్రమే హడావుడి ఉంటుంది.
కానీ.. చంద్రబాబు విషయంలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. ఆయన అరెస్టు చేసిన మొదటి వారంతో పోలిస్తే.. తర్వాతి రోజుల్లో మాత్రం రోజు.. రోజుకు ఆయనపై సానుభూతి పెరుగుతోంది. ఇంత వయసులో ఆయన్ను ఇంతలా వేధించటమా? యాభై రోజులు గడిచిన తర్వాత కూడా ఆయనకు బెయిల్ రాకపోవటం ఏమిటన్నది చర్చగా మారింది. దేశ విదేశాల్లోనూ ఆయనకు సంఘీభావంగా కార్యక్రమాల జోరు పెరుగుతోంది.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఆదివారం గచ్చిబౌలి స్టేడియం వేదికగా చంద్రబాబుకు సంఘీభావంగా నిర్వహించిన సభకు వేలాది మంది హాజరయ్యారు. ఈ సందర్భంగా ఒక కొత్త వైరల్ నినాదం తెర మీదకు వచ్చింది. అదిప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ‘‘కట్టించేవాడ్నే తెచ్చుకుందాం.. కూలగొట్టేవాడ్ని కూల్చేద్దాం’’ అని. సాధారణంగా నినాదాలు రాజకీయాల నుంచి పుట్టుకొస్తాయి. కానీ.. ఇప్పుడు సాధారణ ప్రజల గుండెలు మండి.. తమ ఆగ్రహ జ్వాలల్ని మాటల రూపంలో.. నినాదాల రూపంలో బయటకు తెస్తే.. ఇలానే ఉంటాయన్న మాట వినిపిస్తోంది. కొత్తగా తెర మీదకు వచ్చిన ఈ సరికొత్త నినాదం రాబోయే రోజుల్లో ఏపీ వ్యాప్తంగా మరింత వేగంగా విస్తరిస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.