మోడీ సర్కార్ పై నటి, ఎంపీ నవనీత్ కౌర్ సందర్భానుసారంగా ప్రశంసలు కురిపిస్తోన్న సంగతి తెలిసిందే. జమ్మూకశ్మీర్ రాష్ట్ర విభజన అంశలో కేంద్రం తీసుకున్న నిర్ణయానికి నవనీత్ కౌర్ మద్దతు తెలిపారు. అంతేకాదు, లోక్ సభలో నవనీత్ కౌర్ జమ్మూ కశ్మీర్ గురించి, సైనికుల బలిదానాల గురించి మాట్లాడి మోడీనే మెప్పించారు. తన వాగ్దాటితో ఎందరినో ఆకట్టుకున్న ఈ యువ ఎంపీ…తాజాగా చిక్కుల్లో పడ్డారు. నవనీత్ కౌర్ కు బాంబే హైకోర్టు షాక్ ఇచ్చింది. ఆమె కుల ధ్రువీకరణ పత్రాన్ని రద్దు చేయడంతోపాటు రూ.2లక్షల జరిమానా విధిస్తూ మంగళవారం తీర్పు ఇచ్చింది. బాంబే హైకోర్టు తాజా తీర్పుతో ఆమె ఎంపీ పదవికి కూడా ప్రమాదం పొంచి ఉంది.
కుల ధ్రువీకరణ పత్రాల పరిశీలన కమిటీని తప్పుదారి పట్టించేందుకు నవనీత్ కౌర్ కల్పిత, మోసపూరిత పత్రాలను సమర్పించారని హైకోర్టు అభిప్రాయపడింది. ఆరు వారాల్లోగా అన్ని ధ్రువపత్రాలను సమర్పించాలని ఆదేశించింది. మహారాష్ట్రలోని అమరావతి లోక్సభ స్థానం ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం కాగా…2019లో ఆమె నకిలీ సర్టిఫికెట్తో లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారని ఆమె చేతిలో ఓడిపోయిన శివసేన నేత ఆనందరావు ఆరోపించారు. ఈ ప్రకారం మాజీ ఎంపీ ఆనందరావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణన జరిపిన న్యాయస్థానం తాజాగా సంచలన ఆదేశాలు జారీ చేసింది.
కాగా, బాంబే హైకోర్టు తీర్పుపై అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ స్పందించారు. ఓ భారత పౌరురాలిగా కోర్టు నిర్ణయాన్ని గౌరవిస్తున్నానని వెల్లడించారు. అయితే, ఈ నిర్ణయంపై సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్టు తెలిపారు. న్యాయం జరుగుతుందన్న నమ్మకం తనకుందని నవనీత్ కౌర్ స్పష్టం చేశారు. నవనీత్ అమరావతిలో బద్నేరాకు చెందిన ఎమ్మెల్యే రవి రాణా భార్య అన్న సంగతి తెలిసిందే. అయితే, బీజేపీకి అనుకూలంగా నవనీత్ ఉన్న నేపథ్యంలోనే శివసేన నేతలు ఆమెపై గుర్రుగా ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారం తెరపైకి వచ్చిందని పుకార్లు వినిపిస్తున్నాయి.