ఆంధ్ర, తెలంగాణతోపాటు దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పలు రాష్ట్రాలు ఆంక్షలు విధించడంతోపాటు
స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటిస్తున్నాయి. పొరుగు రాష్ట్రమైన తెలంగాణ కూడా ఈ నెల 31వరకు సంక్రాంతి సెలవులను పొడిగించింది. కానీ, ఏపీలో మాత్రం కరోనా కేసులు పెరుగుతున్నా కూడా విద్యా సంస్థలకు సెలవులు పొడిగించలేదు. ఎవడెలా పోయినా మాకేం…మా నిర్ణయం మాదే అన్న రీతిలో జగన్ సర్కార్ తీరు ఉంది.
ఈ క్రమంలోనే జగన్ కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ లేఖ రాశారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో విద్యాసంస్థల సెలవులు పొడిగించాలని, దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించాయని లోకేశ్ గుర్తు చేశారు. తెలంగాణ, తమిళనాడు, కేరళ రాష్ట్రాలు 2 వారాల పాటు పాఠశాలలకు సెలవులు ప్రకటించాయన్నారు. 15 ఏళ్ల లోపు పిల్లలకు ఇంకా వ్యాక్సిన్ అందుబాటులోకి రాలేదని, థర్డ్ వేవ్ ప్రమాదం పొంచి ఉన్న క్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, టీచర్ల ప్రాణాలతో చెలగాటమాడకూడదని చెప్పారు.
తల్లిదండ్రులను మరింత మానసిక ఆందోళనకు గురిచేయొద్దని, ప్రభుత్వం తక్షణమే విద్యాసంస్థలకు సెలవులు పొడిగించాలని లోకేశ్ కోరారు. గత 10 రోజుల్లో ఏపీలో కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోందని, ఈ సమయంలో స్కూల్స్ ప్రారంభించడం పెను ప్రమాదంగా మారే అవకాశం ఉందని లోకేశ్ అన్నారు. మరి, లోకేశ్ లేఖపై జగన్ ఏ విధంగా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.