సీఎం జగన్ రెడ్డిపై నరసాపురం ఎంపీ, వైసీపీ రెబల్ నేత ఎంపీ రఘురామకృష్ణరాజు సంచలన ఆరోపణలు చేశారు. జగన్ పై షాకింగ్ ఆరోపణలు చేస్తూ తన తోటి ఎంపీలకు రఘురామ లేఖ రాశారు. జగన్ అధికార దుర్వినియోగంతో తనపై కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. సీఐడీ అధికారులతో తనపై కస్టోడియల్ టార్చర్ చేయించారని ఆరోపించారు. తాజాగా మరోసారి తన నివాసం వద్ద పోలీసులు రెక్కీ నిర్వహించారని లేఖలో పేర్కొన్నారు.
లేఖ రాయడానికి ముందు కూడా జగన్, వైసీపీ నేతలపై రఘురామ షాకింగ్ కామెంట్లు చేశారు. తన ఇంటి దగ్గర నుంచి తనను ఎత్తుకెళ్లి చంపడానికి ప్లాన్ చేశారని ఆయన ఆరోపించారు. రెక్కీ నిర్వహించిన వారు పోలీసులమని చెప్పి బుకాయించారని అన్నారు. హైదరాబాద్‌లో ఓ పోలీస్ అధికారి అండ చూసుకొని తనపై రివర్స్ కేసులను పెడుతున్నారని మండిపడ్డారు. ఆ అధికారిపై సీఎం కేసీఆర్‌కు ఇప్పటికే ఆ విషయంపై లేఖ రాశానని, ఆయన స్పందన ఏమిటో చూడాలన్నారు.
కేసీఆర్‌పై తనకు విశ్వాసముందని, అందుకే తాను ఢిల్లీలో ఉన్నప్పటికీ అప్పుడప్పుడు హైదరాబాద్ కు వెళ్లి వస్తున్నానని చెప్పారు. ఆ పోలీస్ అధికారి వ్యవహారంపై సీఎంవో కార్యాలయ కార్యదర్శి నర్సింగరావు, రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ లకు చెప్పేందుకు ఫోన్ చేసే ప్రయత్నం చేశానని తెలిపారు. పోలీసుల వ్యవహార శైలిపై కోర్టును ఆశ్రయిస్తానని, తన అభిమానులు ఆందోళన చెందవద్దని కోరారు.
తనను హత్య చేయడానికి కుట్రపన్నారని, తాను హైదరాబాదులో ఉండగానే అర్థరాత్రి నెంబర్ ప్లేట్ లేని వాహనంలో రెక్కీ నిర్వహించారని ఆరోపించారు. ఆ వాహనం గురించి ఆరా తీసేందుకు సీసీ ఫుటేజ్ కోరగా…ఓ పోలీస్ అధికారి ఇవ్వవద్దని చెప్పారని ఎమ్మార్ ప్రాపర్టీస్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ తనకు తెలిపారన్నారు. ఈ హత్యా రాజకీయాలు ఎన్నాళ్లు కొనసాగిస్తారోనని, తనకు ఏదైనా హానీ తల పెడితే.. ఏమి చేయాలన్నది ప్రజలే నిర్ణయించాలని కోరారు.
ఈ విషయంలో ప్రతిపక్ష నాయకులు చంద్రబాబుతో సహా, ఇతర విపక్షాల నాయకులు, వైసీపీలోని ప్రజాస్వామ్యవాదులు స్పందించాలన్నారు. తాను ప్రయాణించే రైలు భోగిని సత్తెనపల్లి వద్ద దహనం చేసి తనను హత్య చేసేందుకు ప్లాన్ చేశారని ఆరోపించారు. వారు ఎంతకైనా తెగిస్తారని తెలిసే తను జాగ్రత్తలు తీసుకున్నట్లు చెప్పుకొచ్చారు. తనను భౌతికంగా నిర్మూలించేందుకు కుట్ర చేశారన్నారు. తనకు ఏం జరిగినా ముఖ్యమంత్రి జగన్‌దే బాధ్యత అన్నారు.