నందమూరి నటసింహం బాలకృష్ణ, టాలీవుడ్ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుల కాంబోలో వచ్చిన ‘అఖండ’ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబోలో హ్యాట్రిక్ హిట్ రావడంతో నందమూరి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఏపీ, తెలంగాణతోపాటు యూఎస్ ఏలోనూ అఖండ రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతోంది. కరోనా సెకండ్ వేవ్ తర్వాత కళ తప్పిన థియేటర్లలో అఖండ విజయంతో మళ్లీ సందడి మొదలైంది.
చాలాకాలంగా మంచి హిట్ లేక, కరోనా భయాలతో జనాలు థియేటర్లకు పెద్దగా రాక…టాలీవుడ్ క్లిష్టపరిస్థితుల్లో ఉన్న సమయంలో ఈ విజయం మంచి బూస్ట్ ఇచ్చిందని పలువురు సినీ ప్రముఖులు అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలోనే తాజాగా అఖండ సినిమాపై కలెక్షన్ కింగ్ మోహన్ బాబు స్పందించారు. సినీ పరిశ్రమకు ఈ సినిమా ఊపిరి పోసిందని మోహన్ బాబు అన్నారు. అంతేకాదు, కరోనా భయాల నడుమ విడుదలకి సిద్ధంగా ఉన్న అనేక సినిమాలకు ఈ చిత్రం ధైర్యాన్నిచ్చిందని అన్నారు.
నా సోదరుడు బాలయ్యకి, చిత్రబృందానికి మనస్ఫూర్తిగా అభినందనలు అంటూ మోహన్ బాబు కామెంట్ చేశారు. మంచి సినిమాని అదరించే ప్రేక్షక దేవుళ్లకు మోహన్ బాబు ధన్యవాదాలు తెలిపారు. ఇక, విడుదలైన అన్ని చోట్లా కలెక్షన్లతో అఖండ గర్జన కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా అమెరికాలో అఖండ కలెక్షన్లు రికార్డు స్థాయిలో ఉన్నాయి. ఇప్పటికే 7 లక్షల డాలర్ల మార్కును టచ్ చేసిన అఖండ….1 మిలియన్ మార్క్ వైపు దూసుకుపోతోంది. విడుదలైన 3 రోజుల్లోనే అఖండ రూ. 60 కోట్ల గ్రాస్‌ను కలెక్ట్ చేసింది. సింగిల్ స్క్రీన్స్, మల్టీప్లెక్స్‌లలో హౌస్‌ఫుల్ బోర్డ్స్ తో రికార్డుల మోత మోగిస్తోంది.