కాలగర్భంలోకి 2023 కలిసిపోవటానికి మరో రెండు వారాలు మాత్రమే టైముంది. కొత్త సంవత్సరం వచ్చేందుకు రంగం సిద్ధమవుతోంది. ప్రతి ఏటా జరిగేదే అయినా..కొన్ని సంవత్సరాలకు కొంత ప్రత్యేకత ఉంటుంది. అలాంటిదే 2024. ఎందుకంటే.. సార్వత్రిక ఎన్నికలు వచ్చే ఏడాది ఏప్రిల్ -మేలో జరగనున్నాయి. ఈ ఎన్నికల ఫలితాల మీద ఆసక్తి నెలకొంది. వచ్చే ఎన్నికల్లో మరోసారి మోడీ సర్కారు కొలువు తీరితే.. హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకున్న ఘనత ఆయన ఖాతాలో పడుతుంది.
పదేళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్.. వచ్చే ఎన్నికల్లో తన సత్తా చాటాలని తపిస్తున్నా.. అలాంటి అవకాశాలు లేవన్న మాట వినిపిస్తోంది. ఈ వాదనకు బలం చేకూరేలా ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఫలితాలు వెలువడ్డాయి. ఐదు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఒక్క రాష్ట్రం (తెలంగాణ)లో స్వల్ప మెజార్టీతోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో ఈశాన్య రాష్ట్రమైన మిజోరంను పక్కన పెడితే.. హిందీ బెల్టులో జరిగిన మూడు రాష్ట్రాల్లోనూ బీజేపీ విజయం సాధించటం తెలిసిందే.
ఈ ఫలితాలు బీజేపీకి టానిక్ గా మారాయి. ఇదిలా ఉంటే.. వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల్లో మోడీ మరోసారి విజయం సాధిస్తారన్న విషయాన్ని తాజాగా ఫిచ్ రేటింగ్ సంస్థ పేర్కొంది. బీజేపీ గెలుపునకే ఎక్కువ అవకాశాలు ఉన్నట్లుగా పేర్కొన్న ఆ సంస్థ.. అందువల్ల ఇప్పుడున్న విధానాలే అప్పుడు కూడా కొనసాగుతాయని పేర్కొంది. వచ్చే ఏడాదికి ఉన్న ప్రత్యేకత ఏమంటే.. ఆసియాలోని సగానికిపైగా ఎక్కువ దేశాల్లో ఎన్నికలు జరగనున్నాయి. అందులో భారత్ ఒకటి.
వచ్చే ఏడాది ప్రధమార్థంలో జరిగే ఎన్నికల్లో మోడీ సర్కారు మూడోసారి అధికారంలోకి వస్తుందన్న అంచనా వేసింది. అందువల్ల విధానపరంగా ఎలాంటి మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉండబోదని పేర్కొంది. తమ అంచనాలకు తగ్గట్లే.. ‘‘బిబిబి’’ అనే రేటింగ్ ఇచ్చింది. సుస్థిరతకు మారుపేరుగా ఈ రేటింగ్ ను పేర్కొంటారు.