రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి ఎంపిక చేయాలంటే బోలెడన్ని లెక్కలు ఉంటాయి. దశాబ్దాలుగా కనిపించే.. వినిపించే లెక్కల్ని.. ఫార్ములాల్ని పాతరేసి.. తమదైన రీతిలో అంచనాలకు అందని రీతిలో నిర్ణయాలు తీసుకునే మోడీషాలు.. తాజాగా తమదైన స్కూల్ ఎలాఉంటుందో దేశానికి చూపించి ఆశ్చర్యచకితులను చేశారు. రాజస్థాన్ ముఖ్యమంత్రిగా తొలిసారి ఎమ్మెల్యే గా గెలిచిన భజన్ లాల్ శర్మను ఎంపిక చేయటం ఇప్పుడు సంచలనంగా మారింది.
మంగళవారం జైపూర్ లో నిర్వహించిన సమావేశంలో ఎన్నికైన 115 మంది బీజేపీ ఎమ్మెల్యేలు సమావేశమై.. ఆయన్ను తమ శాసనసభాపక్ష నేతగా ఎంపిక చేసుకున్నారు. ఈ భేటీకి బీజేపీ అధిష్ఠానం నుంచి పార్టీ సీనియర్ నేతలు రాజ్ నాథ్ సింగ్ తదితరులు హాజరయ్యారు. ఈ మీటింగ్ తర్వాత రాష్ట్ర గవర్నర్ కల్ రాజ్ మిశ్రాను కలిశారు. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా భజన్ లాల్ ను గవర్నర్ సూచించారు. రాజస్థాన్ సీఎంగా బ్రాహ్మణ వర్గానికి చెందిన భజన్ లాల్ ను.. ఉప ముఖ్యమంత్రులుగా రాజకుటుంబ వారసురాలైన ఎమ్మెల్యే దియా కుమారిని.. మరో డిప్యూటీ సీఎంగా దళిత వర్గానికి చెందిన ప్రేమ్ చంద్ బైర్వాలను ఎంపిక చేయటం.. సింధ్ వర్గానికి చెందిన వాసుదేవ్ దేవ్నానీని ఎంపిక చేశారు.
సీఎంగా ఎంపికైన భజన్ లాల్ శర్మ విషయానికి వస్తే.. చాలా ఏళ్లుగా బీజేపీలో సంస్థాగత పదవుల్లో కొనసాగారు. మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి.. తొలి ప్రయత్నంలో విజయం సాధించటమే కాదు.. ఏకంగా ముఖ్యమంత్రి కావటం గమనార్హం. 56 ఏళ్ల భజన్ లాల్ భరత్ పూర్ జిల్లాలోని సంగనేర్ నియోజకవర్గం నుంచి 48వేల మెజార్టీతో విజయం సాధించారు. సంఘ్ తోనూ మంచి సంబంధాలు ఉన్న ఆయన.. విద్యార్థి దశ నుంచే పొలిటికల్ సైన్స్ లో పీజీ చేశారు. రాజస్థాన్ బీజేపీ ప్రధాన కార్యదర్శిగా పని చేసిన ఆయనకు.. ముఖ్యమంత్రి పదవికి ఎంపిక చేయటం పార్టీలోనే కాదు.. దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. మోడీషాల పొలిటికల్ మూవీ ఇలానే ఉంటుందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.