గత కొంత కాలంగా వైసీపీ మంత్రులకు కొత్త టెన్షన్ పట్టుకున్న సంగతి తెలిసిందే. జగన్ చెప్పిన రెండున్నరేళ్ల డెడ్ లైన్ దగ్గర పడుతుండడంతో తమ పనితీరుకు జగన్ ఎన్ని మార్కులు వేశారు…తమ పదవి ఉంటుందా ఊడుతుందా…అన్న అనుమానం దాదాపుగా అందరు మంత్రులకు ఉంది. ఈ క్రమంలోనే మంత్రి పదవి ఆశిస్తున్న వారు తమ అధినేతను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు.
ఇక, తమకు మంత్రి పదవి దక్కదని ఫిక్స్ అయి అసంతృప్తితోనూ కొందరు వైసీపీ ఎమ్మెల్యేలున్నారు. ఇక, సిక్కోలులో సీనియర్ పొలిటిషన్ అయిన ధర్మాన ప్రసాదరావు కూడా చాలాకాలంగా మంత్రి పదవి కోసం ఎదురు చూస్తున్నారు. అయితే, ఆయనకు మంత్రి పదవి దక్కే అవకాశం లేదని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా సొంత పార్టీపై, ప్రభుత్వంపై ధర్మాన ప్రసాదరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ పనులు చేసిన వారంతా నష్టపోతున్నారని, మార్కెట్ లో సిమెంట్, స్టీల్, ఇసుక ధరలు మండిపోతున్నాయని ధర్మాన షాకింగ్ కామెంట్లు చేశారు. పరువుకు పోయి పనులను చేపట్టిన వైసీపీ ప్రజాప్రతినిధులు ఇబ్బందులు పడుతున్నారని ధర్మాన ప్రసాదరావు చేసిన వ్యాఖ్యలు ఇపుడు హాట్ టాపిక్ గా మారాయి.
ప్రభుత్వం నిర్ణయించిన ఎస్ఎస్ఆర్ రేట్లు కూడా సరిగా లేవని ధర్మాన ప్రసాదరావు పెదవి విరిచారు. మెప్పు కోసం ప్రభుత్వ పెద్దలకు అధికారులు తప్పుడు సలహాలు ఇవ్వొద్దని ఆయన సూచించారు. అధికారుల తీరుతో ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని, ఈ విషయాన్ని తాను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దృష్టికి కూడా తీసుకెళ్లానని అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో పేదల జీవన ప్రమాణాలు దారుణంగా ఉన్నాయన్నారు.
జిల్లా నుంచి వేలాది మంది వలస వెళ్తున్నారని, ఉపాధి హామీ పథకం అమలు కావడం లేదని చెప్పారు. మంత్రి పదవి రాదని తేలిపోవడంతోనే ధర్మాన నోరు విప్పారని అంటున్నారు. వాస్తవానికి జగన్ తొలి కేబినెట్లో సీనియర్ పొలిటిషియన్ అయిన ధర్మాన ప్రసాదరావుకు చోటు దక్కుతుందని ఆశించారు. అనూహ్యంగా ఆయన సోదరుడు కృష్ణదాస్‌ను జగన్ ఎన్నుకొని డిప్యూటీ సీఎంని కూడా చేశారు.