గతంలో ప్రజాప్రతినిధులపై ఉన్న కేసుల విచారణ ఏళ్లకు ఏళ్లు సాగుతూ ఉండేదన్న విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ఒక ప్రజాప్రతినిధిపై కేసు విచారణ పూర్తయ్యే సరికి ఆయన మరోసారి ఎన్నికల్లో గెలిచి పదవి చేపట్టడం…ఆ తర్వాత ఆ కేసుల విచారణలో మరింత జాప్యం జరగడం వంటి పలు పరిణామాల నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఎమ్మెల్యేలు, ఎంపీలపై ఉన్న కేసుల సత్వర విచారణకు ప్రజా ప్రతినిధుల కోర్టు ఏర్పాటైంది.
ఈ క్రమంలోనే తాజాగా ప్రజాప్రతినిధుల కోర్టులో టీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు షాక్ తగిలింది. 2015లో జరిగిన ఓ ఘర్షణ కేసులో దానం నాగేందర్‌కు రూ.1000 జరిమానా లేకుంటే 6 నెలల జైలుశిక్ష విధిస్తూ హైదరాబాద్ జిల్లా మెట్రోపాలిటన్ క్రిమినల్ కోర్టు తీర్పునిచ్చింది. ఎంపీ, ఎమ్మెల్యేల స్పెషల్ సెషన్ కోర్టులో జరిగిన విచారణలో దానం నాగేందర్‌తో పాటు మరొకరిపై నేరం రుజువైందని, యూ/సీ 255(2) సీఆర్పీసీ ప్రకారం ఒక్కొక్కరికి వెయ్యి రూపాయల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది.
ఒకవేళ జరిమానా మొత్తాన్ని చెల్లించని పక్షంలో ఒక్కొక్కరికి 6 నెలల శిక్షను కోర్టు ఖరారు చేసింది. అయితే, ఈ తీర్పుపై అప్పీల్ చేసుకోవడానికి దానం నాగేందర్ కు కోర్టు అవకాశం కల్పించింది. మరోవైపు, ఇదే కోర్టులో తిరుపతి వర్మ అనే న్యాయవాదిని కొట్టిన కేసులోనూ దానం నాగేందర్ పై విచారణ జరుగుతోంది. ఆ కేసులోనూ త్వరలోనే తీర్పు వచ్చే అవకాశముంది.