ఏపీలో ఉద్యోగులకు సమయానికి జీతాలు ఇవ్వడం లేదు. వారు ఇబ్బందులు పడుతున్నారు. ధర్నాలు నిరసనలకు దిగుతామంటే.. పోలీసులను పెట్టి సర్కారు అణిచేస్తోంది.. దీనిని ఎవరూ కాదనరు. అయితే.. ఇదే సమస్య తెలంగాణలోనూ ఉంది. అక్కడ కూడా 20వ తారీకు వచ్చినా.. 20 శాతం మందికి జనవరి నెల వేతనాలు ఇవ్వలేదు. అదేసమయంలో రిటైర్మెంట్ బెనిఫిట్ల కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నవారు కూడా ఉన్నారు. అయితే.. తాజాగా మంత్రి శ్రీనివాసగౌడ్ మాత్రం తెలంగాణలో ఉద్యోగులకు వేతనాలు ఇవ్వని పరిస్థితిని.. 20వతారీకు వచ్చినా.. అందని దుస్థితిని.. కడు చక్కగా సమర్థించుకున్నారు.
దీనిని కూడా ఎవరూ కాదనరు. ఆయన మంత్రిగా ఉన్నారు కాబట్టి.. ప్రభుత్వ పలుకే పలుకుతారు. అయితే, పొరుగున ఉన్న ఏపీపై మాత్రం విమర్శలు గుప్పించారు. తాను ఇటీవల విజయవాడకు వెళ్లానని.. అక్కడి ఉద్యోగులు జీతాల కోసం అలో లక్ష్మణా అని ఏడుస్తున్నారని చెప్పుకొచ్చారు.
అంతేకాదు.. సీఎం కేసీఆర్కు ఒక్క ఛాన్సిస్తే..ఏపీలో ఐదేళ్ల పాలన చేసి.. ఏపీని ఎక్కడికో తీసుకువెళ్తారని చెప్పుకొచ్చారు. తెలంగాణ అభివృద్దిలో పరుగులు పెడుతోందన్నారు. కానీ, ప్రతిపక్షాలు మాత్రం ఆ మూల నుంచి ఈమూల వరకు రాష్ట్రం నాశనం అయిపోయిందని చెబుతున్నారు. ఇక, అప్పుల విషయంలో మొన్ననే కేంద్రం గుట్టు మొత్తం బయట పెట్టింది. రాష్ట్ర ఆవిర్భావం నాటికి అప్పులులేని తెలంగాణ ఇప్పుడు లక్షల కోట్ల అప్పులు చేసిందని చెప్పుకొచ్చింది.
తమ రాష్ట్రాన్ని సమర్థించుకోవడం.. తప్పుకాకపోయినా.. అక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నాయో.. పొరుగు రాష్ట్రంలోనూ అవే ఉండడంపట్ల కొంత ఆలోచించి వ్యవహరించి ఉంటే బాగుండేదని అంటున్నారు పరిశీ లకులు. ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని.. అందుకే.. ఉద్యోగులకు వేతనాలు ఆలస్యమవుతున్నాయని శ్రీనివాస్ గౌడ్ చెప్పుకొచ్చారు. మరి ఏపీలోనూ అంతేకదా! అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. సో.. మంత్రి చెప్పిన మాటలు ఇప్పుడు ఆయనకు రివర్స్ కావడం గమనార్హం.