ఓ రైతు తన వ్యవసాయ బోరుకు విద్యుత్ కనెక్షన్ కావాలని..కొందరు కావాలనే తనకు ఆ కనెక్షన్ రానివ్వకుండా చేస్తున్నారని గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేశారు…సాధారణంగా ఇటువంటి సమస్యను మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి స్వయంగా పట్టించుకునే చాన్స్ ఉండదు..మహా అయితే, మంత్రి తన పీఏకు చెప్పి వదిలేస్తారు. కానీ, మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అలా చేయలేదు. తక్షణమే ఆ సమస్యను పరిష్కరించాలని కలెక్టర్ తో పాటు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మంత్రి ఆదేశాలతో ఆ రైతు వ్యవసాయ బోరుకు విద్యుత్ కనెక్షన్ వచ్చింది. దీంతో, ఆ రైతు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఫొటో పెట్టి జలాభిషేకం చేసి తన పొలంలో నీరు పారించిన వైనం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం నార్పల మండలం వెంకటాపల్లి గ్రామానికి చెందిన రైతు కొరకుటి శ్రీనివాసులు 11 ఎకరాల్లో దానిమ్మ తోట వేశారు. పొలంలో నీటి కోసం లక్షలాది రూపాయలు ఖర్చుపెట్టి 48 బోర్లు వేసినా చుక్క నీరు పడలేదు. ఆఖరి ప్రయత్నంగా తన ఇంటి ముందు బోరు వేస్తే పుష్కలంగా నీళ్లు పడ్డాయి. అయితే, ఆ బోరుకు విద్యుత్ కనెక్షన్ కోసం దరఖాస్తు చేసిన శ్రీనివాసులుకు విద్యుత్ అధికారులు షాక్ ఇచ్చారు.
శ్రీనివాసులు అంటే గిట్టని కొందరు విద్యుత్ అధికారులపై ఒత్తిడి చేసి 9 నెలలుగా విద్యుత్ కనెక్షన్ రాకుండా అడ్డుకుంటున్నారు. ఓ వైపు కాపుకు వచ్చిన కాయలు నీరు లేక ఎండిపోతున్నాయి…పుష్కలంగా పడినా బోరుకు విద్యుత్ కనెక్షన్ లేకపోవడంతో శ్రీనివాసులు నిస్సహాయ స్థితికి చేరారు. చివరకు కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కానీ, అదే సమయంలో టీడీపీ ప్రజావేదిక కార్యక్రమానికి వెళ్లి ఈ సమస్యను తెలియజేయాలని కొందరు టీడీపీ నేతలు సలహా ఇచ్చారు.
వారు చెప్పినట్లుగానే ప్రజా వేదికలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్, టీడీపీ ఎమ్మెల్యే గండి బాబ్జిలు శ్రీనివాసులు సమస్య విని ధైర్యం చెప్పారు. వెంటనే అనంతపురం జిల్లా కలెక్టర్ కు ఫోన్ చేసి ఆ సమస్య పరిష్కరించాలని కలెక్టర్ , పలువురు అధికారులకు కొండపల్లి శ్రీనివాస్ ఆదేశించారు. ప్రజావేదికలో కంప్లయింట్ ఇచ్చిన 4 రోజులకు పోలీస్ అధికారులు, రెవెన్యూ అధికారులు, విద్యుత్ శాఖ శ్రీనివాసులు బోరు దగ్గరకు వచ్చారు. విద్యుత్ శాఖ సిబ్బంది అదే రోజు తన బోరుకు విద్యుత్ కనెక్షన్ ఇచ్చారు. దీంతో, ఎండిపోతున్న దానిమ్మతోటతో పాటు ఆత్మహత్యే శరణ్యం అనుకున్న శ్రీనివాసులు కుటుంబంలో ఆశలు చిగురించాయి. తన సమస్య పరిష్కారమైతే మంత్రి గారి ఫోటో పెట్టుకొని బోరు ఆన్ చేసుకుంటా అని శ్రీనివాసులు గ్రీవెన్స్ లో చెప్పారు. అన్నమాట ప్రకారమే బోరు దగ్గర మంత్రి గారి ఫోటో పెట్టుకుని పూజ చేసి బోర్ ఆన్ చేసుకున్నారు.
తన 60 ఏళ్ల జీవితంలో టీడీపీ వంటి పార్టీని చూడలేదని, యుద్ధప్రాతిపదికన నాలుగు రోజుల్లో రైతు సమస్యను పరిష్కరించి కన్నీళ్లు తుడిచిన ప్రభుత్వం ఈ టీడీపీ ప్రభుత్వం అని శ్రీనివాసులు భావోద్వేగానికి లోనయ్యారు. ఇది పేదల, రైతుల, శ్రామికుల, కర్షకుల, కార్మికుల పార్టీ అని, టీడీపీ నేతలకు, తనకు అండగా నిలిచిన టీడీపీ కార్యకర్తలకు ఆజన్మాంతం తన కుటుంబం రుణపడి ఉంటుందని శ్రీనివాసులు చెప్పారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు, మంత్రి లోకేష్, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే బాబ్జి, అనంతపురం కలెక్టర్, శింగమనల ఎమ్మెల్యే శ్రావణి, స్థానిక టీడీపీ నేతలకు, విద్యుత్ శాఖ అధికారులకు ధన్యవాదాలు తెలిపారు శ్రీనివాసులు.