తెలుగుదేశం పార్టీ రెడ్ బుక్ లో మొదటి వరుసలో ఉండే పేర్లు కొడాలి నాని, వల్లభనేని వంశీ. వైకాపా హయాంలో ఈ ఇద్దరు నేతలు అడ్డగోలుగా మాట్లాడుతూ ఎంత ఓవరాక్షన్ చేశారో.. చంద్రబాబు, లోకేశ్‌తో పాటు వాళ్ల కుటుంబ సభ్యులను ఏ విధంగా అవమానించారో, ఎటువంటి వ్యక్తిగత విమర్శలు చేశారో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. అప్పట్లో కొడాలి నాని, వల్లభనేని వంశీ చేసిన విమర్శలు వైసీపీపై ప్రజల్లో ఒకింత వ్యతిరేకత ఏర్పడటానికి కూడా కారణం అయ్యాయి. సీన్ కట్ చేస్తే.. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో అటు కొడాలి, ఇటు వంశీ ఇద్దరు భారీ తేడాతో ఓడిపోయి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.
అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలలు గడిచినా టీడీపీకి మోస్ట్ వాంటెడ్ గా ఉన్న కొడాలి నాని, వల్లభనేని వంశీపై ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. ఈ విషయంపై పార్టీ శ్రేణులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కానీ తాజాగా కూటమి సర్కార్ అసలు గేమ్ స్టార్ట్ చేసింది. ఎలాంటి హడావుడి లేకుండా, లీకులు ఇవ్వకుండా.. పొద్దు పొద్దునే గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసు బండి ఎక్కించేసింది. గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో వంశీ నిందితుడిగా ఉన్నారు.
ఈ కేసులో ఇప్పటికే బెయిల్ తెచ్చుకున్న ఆయన సెలెంట్ గా ఉండకుండా ఓవరాక్షన్ చేశారు. ఫిర్యాదుదారుడ్ని కిడ్నాప్ చేసి.. బెదిరించి.. కేస్ విత్ డ్రా చేయించారు. ఈ మొత్తం వ్యవహారంపై నిఘా పెట్టిన పోలీసులు.. ఆ ఫిర్యాదుదారుడ్ని పట్టుకుని నిజాన్ని కక్కించారు. దాంతో వంశీ అడ్డకంగా బుక్కైయ్యారు. కేస్ వాపస్ తీసుకున్న సత్యవర్ధన్ తిరిగి వంశీ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడంతో గురువారం తెల్లవారుజాముల హైదరాబాద్ లో సేద తీరుతున్న వల్లభనేని వంశీని పోలీసులు పట్టుకొచ్చేశారు. ఇప్పట్లో ఆయనకు బెయిల్ వచ్చే అవకాశాలు కూడా లేవంటున్నారు.
ఇక వల్లభనేని వంశీ అరెస్ట్ తో కొడాలి నానిలో గుబులు మొదలైందట. పైగా కూటమి సర్కార్ నెక్స్ట్ టార్గెట్ కొడాలినే అంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. గుడివాడలో ఇప్పటికే ఆయనపై చాలా కేసులు కూడా నమోదవడంతో.. వంశీ తర్వాత వంతు నానిదే అంటూ తెలుగు తమ్ముళ్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కొడాలి నాని పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారట. ప్రస్తుతం ఆయనెక్కడ ఉన్నారో ఎవరికీ తెలియదు. వైసీపీ నేతలకే కాదు కనీసం గుడివాడ సన్నిహితులకూ ఆయన అందుబాటులోకి రావడం లేదని టాక్ వినిపిస్తోంది.