టీడీపీ యువ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్ కు కేంద్ర ప్రభుత్వం తాజాగా `జడ్` కేటగిరీ భద్రతను కల్పించింది. అయితే.. దీనిపై వైసీపీ సీనియర్ నాయకుడు, మంత్రి బొత్స సత్యనారాయణ ఏడుపు రాజకీయాలకు తెరదీశారు. “నాకే లేదు.. నేను రెండు సార్లు మంత్రిని.. ఈ పుడింగికి జడ్ భద్రతా“ అంటూ.. ఏడుపు రాజకీయాలు ప్రారంభించారు.
“వెయ్యి అబద్ధాలు ఆడైనా ఓ పెళ్లి చేయాలి అంటారు. కానీ అబద్ధాలతో బంధాలు నిలవవు“ అని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ సూత్రీకరించారు. బీజేపీతో టీడీపీ పొత్తును ఉద్దేశించి ఈ సెటైర్లు వేశారు. బీజేపీ ఆహ్వానిస్తేనే తాము వెళ్లి పొత్తు పెట్టుకున్నామని చంద్రబాబు చెబుతారని, ఆపై అందులో నిజం లేదని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి చెప్పారని మంత్రి బొత్స పేర్కొన్నారు.
ప్రజా ఆగ్రహానికి గురైన వారికి, నోరు అదుపులో పెట్టుకోలేక పోయిన వారికి మాత్రమే బ్లాక్ డ్రెస్ వాళ్ల సెక్యూ రిటీ అని నారా లోకేష్ కు జడ్ కేటగిరి సెక్యూరిటీపై సైతం బొత్స సత్యనారాయణ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సర్కస్ వాళ్ల లాగ డ్రామాలు చేయడానికి ఈ తెలివి పనికొస్తుందన్నారు.
చంద్రబాబు, తన కొడుకు రక్షణ కోసం, లోకేష్ జెడ్ కేటగిరి సెక్యూరిటీ కోసం బీజేపీ కూటమిలో చేరారు తప్ప.. ప్రజలు కోసం కాదన్నది బొత్స మాట. “నాకు గన్ మ్యాన్ కూడా ఇవ్వలేదు. నాకు ఎందుకు.. నేనేం తప్పు చేస్తే అంత సెక్యూరిటీ అవసరం అవుతుంది“ అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేతలకు పటిష్ట భద్రత ఇవ్వవచ్చు, కానీ లోకేష్‌కు ఇంత సెక్యూరిటీ ఎందుకు అని తన అక్కసు వెళ్ల గక్కారు. “ఉమ్మడి ఏపీ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు గా పని చేశా.. జనం విపరీతంగా వచ్చారు. అప్పుడు కూడా నేను భద్రత అడగలేదు“ అని వ్యాఖ్యానించారు బొత్స.