టీటీడీ గోశాల ఇష్యూ ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. ప్రభుత్వం, అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో తిరుమల శ్రీవారి గోశాలలో గత 3 నెలల్లోనే 100కి పైగా ఆవులు మృతి చెందాయని టీటీడీ మాజీ చైర్మన్, వైసీపీ నాయకుడు భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించిన సంగతి తెలిసిందే. అత్యంత పవిత్రమైన టీటీడీ గోశాల పరిస్థితి చాలా దారుణంగా మారిందని.. గోవుల మరణాలను దాచిపెట్టారని భూమన వ్యాఖ్యానించారు. గోవుల మరణాలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అయితే భూమన ఆరోపణలపై తాజాగా దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
కడపలో మీడియాతో మాట్లాడిన ఆనం.. తిరుమలలో అన్ని పూజా కార్యక్రమాలు సక్రమంగా జరుగుతున్నాయని, టీటీడీ గోశాలల్లో ఆవులు చనిపోయాయి అంటూ జరుగుతున్న ప్రచారం గ్లోబల్ ప్రచారం మాత్రమే అని స్పష్టం చేశారు. గోవుల విలువ తెలియని వ్యక్తులు ఈ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆనం మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గోవును తల్లిగా భావిస్తారని.. తల్లిలాంటి గోవుల పరిస్థితిని సీఎం, డిప్యూటీ సీఎం ప్రతినిత్యం పరిశీలిస్తున్నారని ఆనం తెలిపారు.
టీటీడీ గోశాలలో గోవులకు అన్ని వసతులు ఉన్నాయని.. 230 మంది సిబ్బంది గోశాలలో పని చేస్తున్నారని వివరించారు. కూటమి ప్రభుత్వంపై బురద జల్లే ఉద్ధేశంతోనే వయసు పైబడి, అనారోగ్యంతో చనిపోయే ఘటనలను భూతద్దంలో పెట్టి చూపిస్తున్నారని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఫైర్ అయ్యారు. మీ అజ్ఞానానికి ఇదొక నిదర్శనం.. తల్లి గురించి మాట్లాడుతున్నారు మీరు.. మీకు, మీ నాయకుడుకు తల్లి గురించి తెలుసా..? టీటీడీలో మీ నాయకుడు ఎంత అవినీతి మూటగట్టుకున్నారో తెలుసా..? అంటూ భూమన కరుణాకర్ రెడ్డిని ఆనం నిలదీశారు.