దొంగలు దోపిడీదారులతో కలిసి పాలకులు వేదిక పంచుకోకూడదనేది రాజధర్మం. నిందితులు, వేల కోట్ల అటాచ్ మెంట్లు ఉన్న ఆర్థిక నేరగాళ్లతో న్యాయమూర్తులు సన్మానాలు చేయించుకోరాదు, ఆతిధ్యాలు అందుకోరాదు అనేది న్యాయసూత్రం. నాట్ బిఫోర్ లాంటి నైతిక నియావళిలో ఇది కూడా అన్ రిట్టన్ రూల్. కలవడం వల్ల, కలిసి కనిపించడం వల్ల తీర్పులు మారకపోవచ్చు అని వాదించవచ్చు. మరి నైతికత మాటేమిటి ? నేరగాళ్లు, ఆర్థిక ఉగ్రవాదులుగా ముద్రపడిన వాళ్లతో కలిసి కనిపిస్తే తప్పుడు సంకేతాలు వెళ్ళవా సమాజానికి ? వాళ్లు… అప్పీజ్ మెంట్ చేస్తుంటే, ఉన్నత స్థానాల్లో ఉన్నవాళ్లు ఆస్వాదిస్తున్నారా అనే ఫీలింగ్ జనానికి కలగడానికి ఆస్కారం కచ్చితంగా ఉంది. న్యాయంగా ఆలోచిస్తే ఇదే వాస్తవం. ఉన్నత స్థానంలో ఉన్నవాళ్ల వాళ్లు ఉన్నత విలువలకు ప్రతీకలుగా కూడా ఉండాలని ఆశించడం అత్యాశ కాదు. ఉన్నతంగా మెలగడం వాళ్ల కనీస బాధ్యత.
తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఇలాంటి కాళాఖండం ఏదో కనిపించబోతోంది అనే ప్రచారం జరుగుతోంది. సుప్రీంలో అత్యున్నత స్థానంలో ఉన్న చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణకి ముఖ్యమంత్రి సన్మానం అంటుంటే వినడానికి ఆశ్చర్యంగా ఉంది. అంతే షాకింగ్ గానూ అనిపిస్తోంది. కోకా సుబ్బారావు తర్వాత, 50 ఏళ్లకి ఓ తెలుగు వాడికి చీఫ్ జస్టిస్ గా అవకాశం వస్తోంది అని తెలియగానే కులం పేరుతో కక్కిన విషం తెలుగునేల మరచిపోలేదు. అమరావతి రాజధానిగా ఉండకూడదు అనే కుట్రతో అనేక తప్పుడు ప్రచారాలు చేసి, వాటిని నాటి జస్టిస్, ఇప్పటి చీఫ్ జస్టిస్ కూ ఆయన కుటుంబానికి అంటగట్టింది ఇదే ఆర్థిక ఉగ్రవాద మూక. ఆఖరికి ఆంధ్రప్రదేశ్ లో హైకోర్టు బలహీనులు, బాధితులు, న్యాయార్థుల పక్షాన నిలిచిన ప్రతీసారీ ఇదే రమణ పేరుతో దుష్ప్రచారం చేయడం నిజం కాదా ?
రమణ మళ్లీ లోడెత్తాడు అంటూ సోషల్ మీడియాలో పాయిజనస్ కేంపైన్ చూసి హైకోర్టే నిర్ఘాంతపోయి సీబీఐ విచారణ వేయడం వాస్తవమా ? కాదా ? ఇవన్నీ ఇంతలోనే ఎలా మరిచిపోతాం. ఆఖరుకి సాటి తెలుగువాడు చీఫ్ జస్టిస్ గా ఉన్నత స్థానాన్ని అధిరోహించిన తర్వాత తొలిసారి తిరుమల శ్రీవారి దర్శనం కోసం వస్తే కనీసం అధికార లాంఛనాలతో ఆహ్వానించడం ఆనవాయితీ. అలాంటి సంస్కారం కూడా లేని వారి సన్మానాలు స్వీకరించడం అంటే ఎందుకో సగటు తెలుగువాడి మనసు ఒప్పుకోవడం లేదు. ఏదైనా కుతంత్రం పన్నుతున్నప్పుడు, ప్రజావ్యతిరేక నిర్ణయాలతో పీడించే ముందు పైవాళ్ల ఆశీస్సులు తమకి ఉన్నాయని చూపించకోడానికి కలవడం, ఫోటోలు దిగడం, వాటిని పబ్లిసిటీ చేసుకోవడం ఇక్కడ ఆర్థిక ఉగ్రమూకల అలవాటు. ఇదో మోడస్ ఆపెరాండి. అందుకే సన్మానాలు చేయాలన్న ప్రతిపాదనలు వాళ్లు చేయొచ్చు. కానీ అంగీకరించడానికి అంతరాత్మ ఎలా ఒప్పుకుందన్నదే పాయింట్.
ఏపీలో లాలూచీల సీజన్ నడుస్తోంది. ఉన్నత స్థానాల్లో ఉన్నవాళ్లని, పాపులారిటీ ఉన్నవాళ్లని, పలుకుబడి కలవాళ్లనీ ఎలా వాడాలో అలా వాడుతున్న రోజులు. ఓ సినిమాతో జనానికి చేరువైన మాజీ జస్టిస్ చంద్రును వాడుకున్న తీరు చూసి ఆంధ్రప్రదేశ్ నివ్వెరపోయింది. దళిత డాక్టర్ సుధాకర్ ని కొట్టి కొట్టి హింసించి చనిపోయేలా చేసిన చోట, దళిత యువకులకు శిరోముండనం చేయించిన పార్టీ ఏలుబడిలో, దళిత యువతులపై అత్యాచారాలు జరిగినా చలించని రాష్ట్రంలో – దళితులు అమోఘంగా ఉన్నారని చంద్రు నోట పలికించడం చూశాక న్యాయాన్నీ ధర్మాన్నీ వెక్కిరించినట్టు అనిపించింది.
అంతకు ముందు – నిప్పులు కడిగే నిబద్ధత నాది అంటూ దేశ చరిత్రలోనే ప్రెస్ మీట్ పెట్టిన సుప్రీం న్యాయమూర్తిగా చరిత్రకెక్కిన జస్టిస్ చలమేశ్వర్ ను, ఆయన పరిచయాలనూ రాజకీయ ప్రయోజనాల కోసం వాడటం కళ్ల ముందు చరిత్ర. అలాగే ఇప్పుడు రమణ విషయంలోనూ సామాన్యుల్లో సందేహాలు కలగడం సహజం. ఇవాళ సూచన చేశాడు. రేపు దాడి జరిగింది. రేపటి సాయంత్రానికి మళ్లీ మాట మార్చి – కొట్టినోళ్లనే పొగడ్తలతో ముంచెత్తిన సుబ్బారావు గుప్తా లాంటి వాళ్ల వ్యవహారాల్ని చూసిన ఏపీ ఇప్పుడు ఇలా తప్ప మరోలా ఆలోచించే అవకాశం లేదు. ఎందుకంటే ఆర్థిక ఉగ్రమూకల మేనిప్యులేషన్ ఆ స్థాయిలో ఉంది.
నా మీద కుల ఆరోపణలు చేశారు. నా బిడ్డల్ని కోర్టులకు లాగారు. నా పనితీరుపై కుల ప్రశ్నలు వేశారు. నా భాషను, ఇంటెగ్రిటీని ప్రశ్నార్థకం చేయాలనుకున్నారు. చేశారు. ఆఖరుకి సోషల్ మీడియాలో నేరుగా దాడులకి కూడా దిగారు. అయినా నేను అవేం పట్టించుకోని విశాల హృదయుణ్ని – అని నిరూపించుకోవడం కోసం సన్మానానికి ఒకవేళ ఒప్పుకొని ఉంటే అంతకు మించిన విలువల విషాదం మరోటి లేదు. ఎదుటివాడి ఆరోపణలను నేను పట్టించుకున్నాను, స్పందించాను అని నిరూపించడమే అది. నా స్థానపు ఉన్నతిని నిలబెట్టడం, నిబద్ధతను చాటుకోవడం కన్నా – నా వ్యక్తిగత ప్రతిష్టే నాకు ముఖ్యం అని నిరూపించుకున్నట్టు కూడా అవుతుందేమో గౌరవనీయులు ఆలోచించాలి.
రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న అత్యున్నతుడికి ఓ ప్రభుత్వ అధినేత సన్మానిస్తే అభ్యంతరం ఎందుకు అనే ప్రశ్నకు కూడా సమాధానం ఉంది. ఆ ప్రభుత్వ అధినేత ఇవాళ కాకపోతే రేపు అయినా బోనులో నిలబడాల్సిన నిందితుడు అయినప్పుడు – కనీస దూరం పాటించడం మీ నైతిక బాధ్యత.
🙏🙏🙏🙏🙏
మేరా భారత్ మహాన్