పెగాసస్…ప్రస్తుతం దేశాన్ని కుదిపేస్తోన్న ఈ స్పైవేర్ పై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. భారత్ తో పాటు ప్రపంచంలోని పలువురు వీవీఐపీలు, రాజకీయ నాయకుల ఫోన్లు హ్యాక్ చేసిన ఈ సాఫ్ట్ వేర్ సర్వత్రా చర్చనీయాంశమైంది. దేశంలోని పలువురు ప్రముఖుల ఫోన్ నెంబర్లు హ్యాకింగ్‌కు గురైనట్టు అంతర్జాతీయ మీడియాలోనూ కథనాలు వచ్చాయి. ఈ ఇజ్రాయిలీ స్పైవేర్ యమ డేంజర్ అని పొలిటిషియన్లు హడలిపోతున్నారు.
రాజకీయాలకు టెక్నాలజీ వాడకం, సోషల్ మీడియాను పరిచయం చేసిన ఐప్యాక్ అధినేత, రాజకీయ వ్యూహకర్త పీకే కూడా పెగాసస్ బాధితుడే. తాను నాలుగు సార్లు ఫోన్ మార్చినప్పటికీ…లాభం లేకపోయిందని, పెగాసస్ ద్వారా తన ఫోన్లను నాలుగు సార్లు హ్యాక్ చేశారని పీకే స్వయంగా ప్రకటించారు. ఇక, ఏపీ సీఎం జగన్ కూడా పెగాగస్ ను కొందరిపై ప్రయోగించినట్టు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ సంచలన ఆరోపణలు చేశారు.
ఈ నేపథ్యంలో తాజాగా మరో సంచలన విషయంపై మీడియా, సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలడానికి పెగాసస్ కూడా ఒక కారణం అని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నాటి డిప్యూటీ సీఎం జీ పరమేశ్వర, కుమారస్వామి, సిద్ధరామయ్యల వ్యక్తిగత కార్యదర్శుల ఫోన్ నెంబర్లపై నిఘా ఉంచారని అంతర్జాతీయ మీడియా కథనాలు ప్రచురించడం కలకలం రేపింది. కుమార స్వామి కొంప ముంచింది పెగాసస్సేనని అంతా అనుకుంటున్నారు.