కేంద్రంలోని మోడీ సర్కారుతో పూర్తిస్థాయి పోరుకు టీఆర్ఎస్ తెర తీసిన సంగతి తెలిసిందే. ఆ మధ్య వరకు ప్రధానమంత్రి మోడీని విమర్శించే విషయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమేఉండేవారు. ఈ మధ్యన ఆ బాధ్యతను మంత్రి కేటీఆర్ తీసుకున్నారు. డైలీ బేసిస్ లో ఏదో ఒక అంశంపై మోడీని.. బీజేపీ అధినాయకత్వాన్ని.. వారి పాలసీల్ని తప్పు పట్టేలా ట్వీట్లు చేయటం లాంటివి కేటీఆర్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. తాజాగా బీజేపీ చీఫ్ జేపీ నడ్డా తెలంగాణ కు రావటం.. ఆయన హాజరైన బహిరంగ సభలో కేసీఆర్ కటుుంబం చేసిన అవినీతి మీద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలకు బదులుగా అన్నట్లుగా మంత్రి కేటీఆర్ సంచలన ట్వీట్లు చేశారు. తాజా ట్వీట్లను చూస్తే.. అమీతుమీ తేల్చుకోవాలన్న ఆలోచనలో టీఆర్ఎస్ అధినాయకత్వం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తమ అవినీతి గురించి మాట్లాడిన జేపీ నడ్డాకు అంత సీన్ లేదని.. ఆయనకు ఇప్పటికే అవినీతి పంకిలం అంటిందన్న విషయాన్ని ప్రజలు అర్థం చేసుకునేలా ఆయన ట్వీట్ చేశారు.
ది వైర్ అధికారిక ట్విటర్ర ఖాతాలో పోస్టు చేసిన ఒక పోస్టును ఆయన షేర్ చేశారు. అందులో పలు స్కాంలో జేపీ నడ్డా రూ.7వేల కోట్లు మింగేసినట్లుగా అందులో ఉంది. ఈ కారణంతోనే ఆయన్ను కేంద్ర మంత్రి పదవి నుంచి తప్పించినట్లుగా ఆరోపణలు చేయటం ద్వారా.. నడ్డాకు ట్వీట్ తొడపాశం పెట్టినట్లుగా చెప్పాలి. అంతేకాదు.. కర్ణాటకలో త్వరలో సీఎంను మారుస్తారన్న ప్రచారం జోరుగా సాగుతున్న వేళ.. అక్కడి బీజేపీ ఎమ్మెల్యేలు చెప్పినట్లుగా వచ్చిన కొన్ని వార్తా కథనాల్ని షేర్ చేశారు.
వాటికి సంబంధించి ఆయన సంచలన అంశాల్ని ప్రస్తావించారు. ‘‘కర్ణాటకలో సీఎం కావాలంటే ₹2,500 కోట్లు అడుగుతున్నారట. మీ ఎమ్మెల్యేలు చెబుతున్నారు. 40% కమిషన్ ఇవ్వాలని గుత్తేదారులు, 30% కమిషన్ ఇవ్వాలని హిందూ మఠం వాళ్లు అంటున్నారు. వీటన్నింటిపై ఎలా స్పందిస్తారు? ఈడీ, ఐటీ, సీబీఐలకు ఏమైనా ఆదేశాలు ఉన్నాయా?’ అంటూ ట్వీట్ తో నడ్డాను ఉక్కిరిబిక్కిరి చేశారు.
ఇదేదో తాను గాలి మాటగా చెప్పట్లేదని.. తాను చేస్తున్న ఆరోపణలు మీడియాలో వచ్చినవే అన్న విషయాన్ని చెప్పేలా మీడియాలో వచ్చిన కటింగులను తన ట్వీట్ తో షేర్ చేశారు. దీంతో.. తాను మాట్లాడే ఏ మాటకైనా వెనక కారణం ఉంటుందన్న విషయాన్ని చెప్పారని చెప్పాలి.