ఏపీలో సినిమా టికెట్ల రేట్ల తగ్గింపు వ్యవహారం ముదిరి పాకాన పడుతోంది. టికెట్ రేట్లు తగ్గించడం వల్ల థియేటర్ల కలెక్షన్ల కన్నా కిరాణా షాపుల కలెక్షన్లు ఎక్కువ వస్తున్నాయంటూ హీరో నాని చేసిన కామెంట్లు రాజకీయ దుమారం రేపాయి. ఇక, నాని అంటే తనకు తెలియదని, కొడాలి నాని మాత్రం తెలుసని మంత్రి అనిల్ కుమార్ సహా బొత్స, పేర్ని నాని తదితరులు నానికి కౌంటర్ ఇచ్చారు. ఇక, టికెట్ రేట్ల వ్యవహారం దుమారం రేపుతున్న నేపథ్యంలో మంత్రి కొడాలి నాని స్పందించారు.
కిరాణా షాపులకు ఎక్కువ కలెక్షన్లు వస్తే సినిమావాళ్లు తమ పెట్టుబడులతో కిరాణా కొట్లే పెట్టుకోవచ్చు కదా? అని కొడాలి నాని సెటైర్లు వేశారు. సినిమా టికెట్ రేట్లను తాము తగ్గించలేదని, గతంలో ఉన్న రేట్లే ఉన్నాయని గుర్తు చేశారు. కొన్ని సినిమాలకు రేట్లు పెంచాలని కోరుతూ గతంలో కోర్టు ద్వారా అనుమతి తెచ్చుకునేవారని, ఆ పరిస్థితి ఉండకూడదనే జీవో నంబర్ 35 తీసుకొచ్చామని అన్నారు.
అయితే, కోర్టుల అనుమతితో ప్రేక్షకులను కొందరు దోచుకునేందుకు అవకాశం లేకుండా తాము చేశామని కొడాలి నాని వ్యాఖ్యానించారు. టికెట్ ధరలు తగ్గితే ఎగ్జిబిటర్లకు నష్టమంటున్నారని, ఎగ్జిబిటర్లను అడ్డం పెట్టుకుని కొందరు గేమ్ ఆడుతున్నారని ఆరోపించారు. ఇక, వంగవీటి రాధాపై నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాధా బంగారం లాంటి వ్యక్తి అని, రాగి కలిస్తేనే బంగారం కూడా కావలసిన ఆకృతిలోకి మారుతుందంటే వినడం లేదని పరోక్షంగా వైసీపీలో చేరడంపై నాని చేసిన కామెంట్లు ఇపుడు హాట్ టాపిక్ గా మారాయి. కల్మషం లేకుండా తాను నమ్మిన దారిలోనే రాధా నడుస్తున్నాడని కొడాలి నాని కొనియాడడం చర్చనీయాంశమైంది.