నెల్లూరు వైసీపీలో అంతర్గత పోరు పతాక స్థాయికి చేరింది. మంత్రి కాకాణి వర్సెస్ మాజీ మంత్రి అనిల్ గా కోల్డ్ వార్ జరుగుతోంది. మంత్రిగా ఎంపికైన కాకాణి గోవర్ధన్ రెడ్డి తొలిసారి నెల్లూరు వచ్చిన రోజు సభ నిర్వహించగా…అదే రోజు నగరంలో మాజీ మంత్రి అనిల్ సభ నిర్వహణ నిర్వహించడంతో వర్గపోరు పుకార్లు ఖాయమయ్యాయి. ఓ దశలో ఈ ఇద్దరు నేతలు నెల్లూరు రాజకీయాల్లో బల ప్రదర్శనకు ప్రయత్నిస్తున్నారా అన్న అనుమానాలూ ఉత్పన్నమయ్యాయి.
దీంతో, ఇద్దరి సభల దగ్గరా పోలీసులు కూడా భారీగా సిబ్బందిని మోహరించారు. ఈ క్రమంలోనే ఇద్దరు నేతలతోనూ అదే రోజు మాట్లాడిన పార్టీ పెద్దలు…వివాదస్పద వ్యాఖ్యలు చేయకుండా కార్యక్రమాలు ముగించాలని సున్నితంగా వార్నింగ్ ఇచ్చాయట. దీంతో, మంత్రిగా అందరినీ కలుపుకొని పనిచేస్తానని చెప్పి సైలెంట్ అయ్యారు కాకాణి. పార్టీ విజయం సాధిస్తే తనకు మరోసారి మంత్రి పదవి దక్కొచ్చని, కాకాణి నుంచి తనకు ఆహ్వానం అందలేదని అనిల్ షాకిచ్చారు.
దీంతోపాటు ఫ్లెక్సీలకు సంబంధించి కూడా రచ్చ జరిగింది. కాకాణి గురించి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చించేశారు. దీంతో, వీరిద్దరి మధ్య కోల్డ్ వార్ పై మీడియాలో కథనాలు వచ్చాయి. పరిస్థితి రోజురోజుకూ దిగజారుతుండడంతో ఎమ్మెల్యేలపై జగన్ కు పట్టు సడలుతోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆ కథనాలపై సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఆ ఇద్దరు నేతలపై సీరియస్ అయిన జగన్…వారిని వచ్చి కలవాలంటూ ఆదేశించారు.
సీఎం క్యాంపు కార్యాలయం నుంచి కాకాణి, అనిల్ లకు ఫోన్ వచ్చింది. బుధవారం మధ్యాహ్నం ఆ ఇద్దరు నేతలు క్యాంపు కార్యాలయానికి రానున్నారు. వీరిద్దరికీ జగన్ క్లాస్ పీకబోతున్నారని తెలుస్తోంది. విభేదాలను పక్కకుపెట్టి కలసికట్టుగా పని చేయాలని ఇద్దరికీ జగన్ సీరియస్ వార్నింగ్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది.