ప్రముఖ నటి, పర్యావరణ కార్యకర్త జూహీచావ్లాకు ఢిల్లీ హై కోర్టు జరిమానా విధించింది. కేవలం ప్రచారం కోసమే జూహీ కోర్టులో పిటీషన్ వేసినట్లుందంటు మండిపడింది. ఇంతకీ విషయం ఏమిటంటే దేశంలో మొబైల్ 5 జీ టెక్నాలజీ అనుమతికి వ్యతిరేకంగా జూహీ ఢిల్లీ హైకోర్టులో ఓ కేసు వేశారు. ఈ కేసును హై కోర్టు ఆన్ లైన్లో విచారణ జరిపింది.
విచారణ సందర్భంగా అనేకసార్లు బాగా గోల జరిగింది. విషయం ఏమిటాని ఆరాతీస్తే ఆన్ లైన్లో జూహీ అభిమానులు విచారణ మధ్యలో లైన్లోకి వచ్చి ఆటంకాలు సృష్టిస్తున్నట్లు అర్ధమైంది. విచారణకు జారీచేసిన లింకును జూహీ ఉద్దేశ్యపూర్వకంగానే లీక్ చేసినట్లు కోర్టు నిర్ధారణకు వచ్చింది.
దాంతో విచారణను అప్పట్లో వాయిదావేసింది. ఆ కేసును తిరిగి శుక్రవారం విచారించింది. ఫైనల్ వాదనల తర్వాత జూహీ వేసిన కేసును కొట్టేసింది.
కేవలం ప్రచారం కోసమే సినీనటి కోర్టులో కేసు వేసినట్లుందని కోర్టు వ్యాఖ్యానించింది. అలాగే జూహీ అభిమానులమని చెప్పుకున్న వాళ్ళు ఆన్ లైన్ విచారణకు ఆటంకం కలిగించటంపైన కోర్టు మండిపోయింది.
అన్నీ కలుపుకుని జూహీకి కోర్టు రు. 20 లక్షల జరిమానా విధించింది. అలాగే ఆన్ లైన్ విచారణకు ఆటంకాలు కలిగించిన వారిని గుర్తించి కేసులు పెట్టమని కూడా పోలీసులను కోర్టు ఆదేశించింది.