అనంతపురం రాజకీయాల్లో జేసీ బ్రదర్స్‌కు ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. తమ ఆసక్తికర వ్యాఖ్యలతో, పంచ్ డైలాగులతో జేసీ సోదరులు నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడడం…సమయం, సందర్భం వస్తే తన, మన అన్న భేదం లేకుండా చెప్పాలనుకున్నది చెప్పేయడం జేసే బ్రదర్స్ నైజం. స్వపక్షమైనా, ప్రతిపక్షమైనా…ముక్కుసూటిగా అనుకున్నది అనుకున్నట్లుగా చెప్పండి ఒక్క జేసీ బ్రదర్స్ కే చెల్లుతుంది.
ఇక, తాజాగా మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తరహాలోనే ఆయన సోదరుడు జేసీ ప్రభాకర్‌రెడ్డి…చంద్రబాబునుద్దేశించి చేసిన వ్యాఖ్యలు పెను ప్రకంపనలు రేపుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా జరిగిన రాయలసీమ టీడీపీ నేతల సమావేశంలో తాడిపత్రి మున్సిపలన్ ఛైర్మన్ జేసీప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీమలో ప్రాజెక్టులను కాదు….ముందు టీడీపీ కార్యకర్తలను కాపాడండి అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి.
ఇవాళ జరిగే సమావేశానికి అందరికీ ఆహ్వానం అందలేదని, ఒకరిద్దరు నేతల కనుసన్నుల్లోనే ఈ సమావేశం జరుగుతోందని జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాదు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ విషయాలపై దృష్టి సారించాలని జేసీ సూచించారు.
అనంతపురంలో గత రెండేళ్ల నుంచి ఒక్క టీడీపీ కార్యకర్తను కూడా జిల్లా నాయకులు పట్టించుకోలేదని షాకింగ్ వ్యాఖ్యలు చేశారు.
అటువంటిది, ఇప్పుడు నీటి ప్రాజెక్టులపై సదస్సులు అంటే కార్యకర్తలు వస్తారా అని ప్రశ్నించారు. సదస్సులు నీటి ప్రాజెక్టులపై కాదని, కార్యకర్తలను పట్టించుకునే సదస్సులు పెట్టాలని హితవు పలికారు. ఒక్క కార్యకర్తకు కూడా టీడీపీ నేతలు అండగా లేరని సంచలన ఆరోపణలు చేశారు.. కార్యకర్తల కోసం మీటింగ్‌లు పెట్టాలని, ప్రాజెక్టులపై సదస్సులు శుద్ధ దండగని కుండబద్దలు కొట్టారు. గతంలో ఈ ప్రాజెక్టులపై ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అన్ని పార్టీలు పోరాడినా ఫలితం లేదని దుయ్యబట్టారు.