టిడిపి నేత, మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జెసి దివాకర్ రెడ్డి గురించి పరిచయం అక్కర్లేదు. అనంతపురం జిల్లాలో ఫైర్ బ్రాండ్ నేతగా పేరున్న జెసి ముక్కుసూటిగా వ్యవహరించడంతోపాటు పలు వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తలో నిలుస్తుంటారు. ఇక, ప్రభుత్వ అధికారులు, పోలీసులతో కూడా జెసి దివాకర్ రెడ్డి పలుమార్లు దురుసుగా ప్రవర్తించి వార్తల్లో నిలిచారు. ఈ నేపథ్యంలోనే తాజాగా అనంతపురం జిల్లా మహిళా కలెక్టర్ నాగలక్ష్మితో జేసీ వాగ్వాదానికి దిగారు.
అంతేకాదు, ఆమెపై అసహనం వ్యక్తం చేస్తూ బల్లపై పేపర్లు విసిరేయడం సంచలనం రేపుతోంది. తాడిపత్రి మండలం సజ్జలదిన్నెల్లో ప్రభుత్వానికి చెందిన 70 కోట్ల విలువ చేసే 7 ఎకరాల భూమి అన్యాక్రాంతమైందని జెసి కొద్ది నెలలుగా ఆరోపణలు, ఫిర్యాదులు చేస్తున్నారు. దీనికి సంబంధించి అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో స్పందన కార్యక్రమానికి జెసి స్వయంగా వచ్చారు.
ఈ సందర్భంగా కలెక్టర్ నాగలక్ష్మికి ఫిర్యాదు అందించేందుకు జెసి ప్రయత్నించారు. ఫిర్యాదు తీసుకున్నామని, పరిశీలిస్తామని, ఇక మీరు వెళ్ళండి అంటూ కలెక్టర్ నాగలక్ష్మి చెప్పారు. దీంతో అసహనానికి గురైన జెసి…కలెక్టర్ పై ఫైర్ అయ్యారు. ఫిర్యాదుదారులు చెప్పే వివరాలు వినే ఓపిక లేనప్పుడు స్పందన ఎందుకు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్ అయిన తన పరిస్థితి ఇలా ఉంటే సామాన్యుల పరిస్థితి ఏమిటి అంటూ చేతిలోని పత్రాలను తీసుకొని కలెక్టర్ ముందు బల్లపై విసిరి కొట్టారు.
ఇక, జెసిని అడ్డుకునేందుకు వచ్చిన సెక్యూరిటీ గార్డును కూడా జెసి నెట్టివేసే ప్రయత్నం చేశారు. ఐఏఎస్ అధికారుల విధులు ఈ కలెక్టర్ కు తెలిసినట్లు లేవని జెసి ఆరోపించారు. మహిళలను గౌరవిస్తామని, కానీ, ఇలా ప్రజా సమస్యలపై స్పందించకుంటే సహించమని జెసి అన్నారు.