జనసేన పార్టీ రాష్ట్రంలో చేపట్టిన అనేక కార్యక్రమాలు ఉన్నాయి. ఎస్సీలపై దాడులు జరిగినప్పుడు.. అ మరావతి రాజధానిపై కలకలం రేగినప్పుడు.. రైతు సమస్యలు.. కౌలు రైతుల ఆత్మహత్యలు ఇలా.. అనేక అంశాలపై జనసేన పోరు బాటపట్టింది. అయితే.. అప్పట్లో జనసేనకు పెద్దగా మైలేజీ రాలేదనే టాక్ ఉంది.
పవన్ ఏం చేసినా.. పెద్దగా ప్రజల్లోకి వెళ్లలేదు. ఎందుకంటే.. ఆయా సమస్యలు కేవలం కొన్ని వర్గాలకు మాత్రమే పరిమితం అయ్యాయి. దీంతో ఆయా వర్గాల వారు మాత్రమే.. జనసేన ఉద్యమాలపై రియాక్ట్ అయ్యారు.
ఇక, ప్రభుత్వ పరంగా ను.. వైసీపీ పరంగానూ.. పెద్ద ఎత్తున తిప్పికొట్టే కార్యక్రమం జరిగింది. దీంతో జనసేన ఏం చేసినా.. అను కున్న విధంగా అయితే.. మైలేజీ కనిపించలేదు.
కానీ, ఇప్పుడు తాజాగా జనసేన చేపట్టిన కార్యక్రమం.. మాత్రం వైసీపీలో కలవర పెడుతోంది. “గుడ్ మార్నింగ్ సీఎం సర్“ అనే నినాదంతో చేపట్టిన కార్యక్రమం పై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చ సాగుతోంది.
రాష్ట్రంలోని రహదాలు గుంతలు పడ్డాయి. రాష్ట్రంలో ఏ మూలకు వెళ్లినా.. ఒక్క జాతీయ రహదారులు తప్ప.. ఇంకేవీ బాగోలేదనే టాక్ ఉంది. ఇది.. సామాన్యుల నుంచి అసామాన్యుల వరకు అందరినీ ఇబ్బం ది పెడుతోంది.
ఈ క్రమంలో జనసేన చేపట్టిన గుడ్ మార్నింగ్ సీఎం సర్.. కార్యక్రమానికి అన్ని వర్గాల నుంచి విశేష స్పందన లభిస్తోంది. అంతేకాదు.. పవన్ తన ట్విట్టర్లో పెడుతున్న పోస్టులు, కర్టూన్లకు కూడా భారీ ఎత్తున లైకులు పడుతున్నాయి.
ఈ పరిణామాలను గమనిస్తున్న వైసీపీ నాయకులు.. దీనికి సమాధానం చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. పైగా జూలై 15 నాటికి రాష్ట్రంలోని రోడ్లపై ఒక్క గుంత కూడా కనిపించడానికి వీల్లేదని సీఎం జగన్ స్వయంగా ఆదేశించారు. అయితే.. దీనికి సంబంధించి ఇప్పటికీ నిధులు కేటాయించకపోవడంతోనే పనులు ఎక్కడికక్కడే అన్నట్టుగా మారిపోయాయి.
సరిగ్గా సమయం చూసుకుని.. పవన్ జెండా ఎత్తేసరికి సహజంగానే వైసీపీలో కలవరం ప్రారంభమైంది. ఇది ఏఒక్క నియోజకవర్గానికో.. పరిమితం కాకపోవడం.. ప్రతి జిల్లాలోనూ సమస్యలు ఉండడంతో ఇప్పుడు ఏం చేయాలనే విషయంపై వైసీపీ అధిష్టానం తలపట్టుకుంది.