సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అల్లు అర్జున్ అరెస్టై ఆ తర్వాత మధ్యంతర బెయిల్ పై విడుదలైన సంగతి తెలిసిందే. అంతకుముందు, అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు విధించిన 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ గడువు నేటితో ముగిసింది. ఈ క్రమంలోనే రెగ్యులర్ బెయిల్ కావాలని నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్ పిటిషన్ దాఖలు చేశారు. దానిపై నాంపల్లి కోర్టు విచారణను డిసెంబరు 30వ తేదీకి వాయిదా వేసింది.
కౌంటర్ దాఖలుకు ప్రభుత్వం తరఫు న్యాయవాది సమయం కోరడంతో విచారణ వాయిదా పడింది. తొక్కిసలాట ఘటన కేసు విచారణ, అల్లు అర్జున్ జ్యుడీషియల్ రిమాండ్ పై తదుపరి విచారణను జనవరి 10కి కోర్టు వాయిదా వేసింది. లెక్క ప్రకారం ఈ రోజు నాంపల్లి కోర్టులో జరిగిన విచారణకు అల్లు అర్జున్ స్వయంగా హాజరు కావాల్సి ఉంది.
ఆ క్రమంలోనే కోర్టు పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసులను మోహరించారు. కానీ, వర్చువల్ గా విచారణకు హాజరయ్యేందుకు అల్లు అర్జున్ కు జడ్జి అనుమతినివ్వడంతో ఆయన కోర్టుకు రాలేదు. ఈ రోజు రెగ్యులర్ బెయిల్ వస్తుందని ఆశించిన అల్లు అర్జున్ కు కోర్టులో చుక్కెదురైనట్లయింది.