భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నిన్న కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఢిల్లీలోని ఆయన పార్థివ దేహానికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు అర్పించారు. మన్మోహన్ సింగ్ కుటుంబాన్ని పరామర్శించిన చంద్రబాబు….మన్మోహన్ మృతి పట్ల ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన చంద్రబాబు.. మన్మోహన్ సింగ్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.
మన్మోహన్ సింగ్ గొప్ప ఆర్థిక వేత్త అని, దేశ ఆర్థిక వ్యవస్థకు దశ, దిశ చూపిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. దేశం కోసం ఆయన నిర్విరామంగా శ్రమించారని, ఆయన సేవలను ఈ దేశం ఎన్నటికీ మరచిపోదని ప్రశంసించారు. ఉన్నత పదవులను, బాధ్యతలను మన్మోహన్ సింగ్ సమర్థవంతంగా నిర్వహించారని అన్నారు.
మన్మోహన్ ప్రధానిగా ఉన్నపుడే ఉపాధి హామీ పథకం, సమాచార హక్కు చట్టం, ఆధార్, విద్యా హక్కు చట్టం వంటి కీలక సంస్కరణలు, నిర్ణయాలు అమల్లోకి వచ్చాయన్నారు. మన్మోహన్ సింగ్ భావజాలం శాశ్వతంగా నిలిచి ఉంటుందని చంద్రబాబు చెప్పారు.